గుజరాత్ సర్కారులో లుకలుకలు
బిజెపి ఎంతగానో పోరాడి తిరిగి అధికారం దక్కించుకున్న గుజరాత్ రాష్ట్రంలో అప్పుడు రాజకీయ లుకలుకలు మొదలయ్యాయి. ముఖ్యంగా మంత్రివర్గంలో శాఖల కేటాయింపు పెద్ద సమస్యగా మారింది. ఈ సమస్యను అదనుగా చూసుకుని పటేళ్ల ఉద్యమనేత హార్దిక్ పటేల్ ఓ కొత్త పిలుపునిచ్చారు. పది మంది ఎమ్మెల్యేలను తీసుకుని బయటకు రండి..అప్పుడు చూద్దాం అసలు సంగతి అంటూ ఆఫర్లు ఇస్తున్నాడు. ఈ వ్యవహారం రాష్ట్రంలో హాట్ హాట్ గా మారింది. ప్రధానంగా ఉప ముఖ్యమంత్రి నితిన్‌భాయ్ పటేల్ స్టైల్ గుజరాత్‌లో కొత్త రాజకీయానికి తెరలేపింది.ఆయన తనకు కేటాయించిన శాఖలపై తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. బీజేపీ గౌరవించని పక్షంలో ఇంకా పార్టీని పట్టుకుని వేలాడే అవసరం నితిన్‌కు ఏమిటని హార్దిక్ ప్రశ్నిస్తున్నాడు. సారంగపూర్‌లో మీడియాతో మాట్లాడుతూ హార్దిక్ ఈ వ్యాఖ్యలు చేశాడు. శాఖల కోతలు, బాధ్యతల స్వీకరణలో ఆలస్యంపై నితిన్ పటేల్ ఇప్పటిదాకా ఎలాంటి అధికార ప్రకటనచేయనప్పటికీ, ఆయన అవమాన భారంతో రగిలిపోతున్నట్లు, తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమైనట్లు సన్నిహితవర్గాలు చెబుతున్నాయి.
ఒకవేళ పరిస్థితి అసంతృప్తి తారాస్థాయికి చేరితే మాత్రం బీజేపీ చెయ్యి జారి గుజరాత్ రాజకీయాల్లో సమూల మార్పులు వాటిల్లే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి ఓ పది మంది ఎమ్మెల్యేలను తీసుకుని బయటకు వస్తే కాంగ్రెస్ తో మాట్లాడి గౌరవప్రద స్థానం దక్కేలా చూస్తానని హార్దిక్ హామీ ఇవ్వటం విశేషం. తాజా పరిణామాలు గుజరాత్ లో అధికారాన్ని తిరిగి నిలబెట్టుకున్నామనే ఆనందం లేకుండా చేస్తున్నాయ్ బిజెపికి. అయితే వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందో వేచిచూడాల్సిందే. టీ కప్పులో తుఫాన్ లా సమసి పోతుందా..లేక హార్దిక్ పటేల్ కోరకుంటున్నట్లు రాజకీయ మలుపులకు నాంది అవుతుందా అన్న సస్పెన్స్ గుజరాత్ లో నెలకొంది.