Top
Telugu Gateway

అయినా..బిజెపినే గెలుస్తుందట!

గుజరాత్ లో బిజెపి సుదీర్ఘ పాలన. సహజంగా ఉండే ప్రభుత్వ వ్యతిరేకత. జీఎస్టీపై వ్యాపార వర్గాల్లో ఆక్రోశం. నోట్ల రద్దు కష్టాలు. కొన్ని చోట్ల మోడీ సభలకు పెద్దగా రాని జనాలు. అయినా సరే గుజరాత్ లో నువ్వా నేనా అన్నట్లు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి బిజెపినే అధికారం దక్కించుకుంటుందని ఎగ్జిట్ పోల్స్ లెక్కలుకట్టాయి. ఒకటి కాదు..రెండు కాదు..దేశంలోని ప్రముఖ ఛానల్స్ అన్నీ కూడా బిజెపి వైపే మొగ్గుచూపాయి. తన నిర్ణయాలతో రాజకీయంగా నష్టపోయేందుకు సిద్ధమే అని ప్రధాని మోడీ ప్రకటిస్తే నిజమే కాబోలు అనుకున్నారు అందరూ. అయితే గుజరాత్ ఎన్నికల సమయంలో మోడీ ప్రచార తీరుచూసిన వారందరూ మాత్రం ఇదంతా కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం చేసిన స్టంట్ తప్ప...మరొకటి కాదని తేలిపోతుంది. తాను గుజరాతీనని..బీసీనని అంటూ ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. అంతే కాదు..గతంలో ఏ ప్రధాని చేయని తరహాలో గుజరాత్ ఎన్నికల్లో పాకిస్తాన్ జోక్యం చేసుకుంటోందని ఆరోపించి మోడీ తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది.

ఇన్ని ఉన్నా కూడా బిజెపినే గెలుస్తుందనే సంకేతాలు వెలువుడుతున్నాయంటే మోడీ చేసిన జిమ్మిక్ ల పనిచేసినట్లే కన్పిస్తున్నాయి. ఏమైనా సస్పెన్స్ ఈ నెల 18 వరకూ కొనసాగనుంది. గురువారం నాడు రెండో విడత ఎన్నికలు పూర్తయిన అనంతరం పలు సర్వే సంస్థలు, వివిధ మీడియా గ్రూపులు కలిసి చేసిన సర్వేలో గుజరాత్‌తోపాటు హిమాచల్‌ ప్రదేశ్‌లలో కమలానిదే విజయం అని తేల్చాయి. గుజరాత్‌ అసెంబ్లీలో మొత్తం 182 స్థానాలుండగా.. ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు 92 స్థానాల్లో గెలవాల్సి ఉంటుంది. బీజేపీకి 115 సీట్లు, కాంగ్రెస్‌కు 64 సీట్లు వస్తాయని టైమ్స్‌ నౌ–వీఎంఆర్‌ పోల్‌ తెలిపింది. ఏబీపీ–సీఎస్‌డీఎస్, ఎన్డీటీవీ సర్వే కూడా ఇంచుమించు ఇదే ఫలితాలు వస్తాయని అంచనా వేశాయి. ఆజ్‌తక్‌ సర్వే మాత్రం 22 ఏళ్లుగా ఉన్న అధికారాన్ని బీజేపీ కాపాడుకుంటున్నప్పటికీ.. గతంతో పోలిస్తే సీట్లు మాత్రం గణనీయంగా తగ్గుతాయని పేర్కొంది. 99–113 స్థానాల్లో కమలంపార్టీ గెలుస్తుందని తెలిపింది. అన్ని సర్వేలూ కాంగ్రెస్‌ పార్టీ 68 నుంచి 82 సీట్ల వరకు గెలవొచ్చని అంచనా వేశాయి. అయితే, టుడేస్‌ చాణక్య మాత్రం బీజేపీ 135 స్థానాల్లో విజయ బావుటా ఎగరేస్తుందని పేర్కొంది. కాంగ్రెస్‌ 47 సీట్లకే పరిమితమవుతుందని తెలిపింది. మిగిలిన ఇతర సర్వేలు కూడా బీజేపీకి 109–112 స్థానాలు, కాంగ్రెస్‌కు 65–75 స్థానాలు వస్తాయని అంచనావేశాయి. 2012లో 72 శాతం ఓటింగ్‌ నమోదవగా బీజేపీ 115 స్థానాల్లో, కాంగ్రెస్‌ 68 సీట్లలో గెలుపొందాయి. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎప్పటిలాగానే ఎగ్జిట్ పోల్స్ ను పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెబుతోంది.

గుజరాత్‌లో పార్టీల వారీగా (ఓట్ల శాతం)

సర్వే సంస్థ బీజేపీ కాంగ్రెస్‌ ఇతరులు

సీఎస్‌డీఎస్‌–ఏబీపీ 49 41 10

టుడేస్‌ చాణక్య 49 38 17

ఇండియాటుడే–యాక్సిస్‌ 47 42 11

టైమ్స్‌నౌ–వీఎమ్మార్‌ 47 41 12

సీఓటర్‌ 47.4 43.3 9.3

Next Story
Share it