Telugu Gateway
Andhra Pradesh

చంద్రబాబు అవినీతిపై విచారణ తప్పదు

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్ లో చంద్రబాబు అవినీతిపై విచారణ తప్పదని ప్రకటించారు. పాదయాత్ర చేస్తున్న జగన్ బుధవారం నాడు మీడియాతో చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగానే ఆయన ఈ మాటలు అన్నారు. పోలవరం ప్రాజెక్టులో చంద్రబాబు అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. అందుకే కేంద్ర ప్రభుత్వం చేపట్టాల్సిన పనులను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని చెప్పారు. ‘పోలవరం అవినీతిపై భవిష్యత్తులో ఖచ్చితంగా విచారణ జరుగుతుంది. కాంట్రాక్ట్‌ లు, సబ్‌ కాంట్రాక్ట్‌ ల పేరుతో టీడీపీ నేతలు దోచుకుంటున్నారు. ప్రాజెక్టుల అంచనాలను ఇబ్బడిముబ్బడిగా పెంచుతున్నారన్నారు. అవినీతిపరులు, అక్రమార్కులకు చంద్రబాబు అండగా నిలిచారు. చంద్రబాబు హయాంలో కొత్తగా ఒక్క ప్రాజెక్టు కూడా కట్టలేదు. వైఎస్సార్‌ హయాంలో 90శాతం పూర్తైనా ప్రాజెక్టుల గేట్లు తెరిచి.. తానే కట్టానని చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటున్నారని’ వైఎస్‌ జగన్‌ విమర్శించారు. జగన్ పాదయాత్ర అనంతపురంలో బుధవారంతో ముగిసింది. ఈ సందర్భంగానే ఆయన మీడియాతో మాట్లాడారు.

ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని చంద్రబాబు నెరవేర్చలేదని జగన్ ఆరోపించారు. తాను చంద్రబాబులా కాకుండా నిబద్ధతతో పనిచేస్తానని. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తానని ప్రకటించారు. తాము అధికారంలోకి వస్తే ఏమి చేయబోయేది ముందుగానే ప్రకటిస్తామని తెలిపారు. తాము ఇచ్చిన మాటకు కట్టుబడకపోతే ఎవరైనా మమ్మల్ని ప్రశ్నించవచ్చని వ్యాఖ్యానించారు. సంక్షేమ పథకాల అమలులో కులాలు, మతాలు, పార్టీలను చూడబోమని, అర్హులందరికీ న్యాయం చేస్తామని తెలిపారు. పార్టీలోకి రావాలంటే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని శిల్పా చక్రపాణిరెడ్డికి సూచించిన విషయాన్ని గుర్తుచేశారు. రాజీనామా చేశాకే చక్రపాణిరెడ్డి తమ పార్టీలో చేరారని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు విలువలకు తిలోదకాలిచ్చారని, నిస్సిగ్గుగా ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని వైఎస్‌ జగన్‌ ధ్వజమెత్తారు.

Next Story
Share it