Telugu Gateway
Andhra Pradesh

టీటీడీతోనూ చంద్ర‌బాబు రాజ‌కీయాలు

తిరుమ‌ల తిరుప‌తి దేవస్థానం (టీటీడీ)లో ఎలాంటి రాజ‌కీయాలు చేయ‌కూడదు. కానీ ఓ ముఖ్య‌మంత్రే ప‌విత్ర‌మైన తిరుమ‌లను త‌న రాజ‌కీయ అవ‌స‌రాల కోసం వాడుకుంటే?. అది ఎలా అంటారా?. ప్ర‌స్తుతం అక్క‌డ జ‌రుగుతున్న‌ది అదే. ఎలాగో మీరూ చూడండి. టీటీడీ జెఈవోగా శ్రీనివాస‌రాజు బాధ్య‌త‌లు చేప‌ట్టి ఆరున్న‌ర సంవ‌త్స‌రాలు దాటింది. ఓ సారి ఆయ‌న్ను బ‌దిలీ చేయాల‌ని ప్ర‌తిపాదించగానే ఓ సుప్రీంకోర్టు జ‌డ్జి నేరుగా రంగంలోకి దిగారు. మ‌రికొంత కాలం కొనసాగించాల‌ని సూచించారు. అంతే అది ఆగిపోయింది. త‌ర్వాత కూడా మ‌రో సారి కూడా అలాగే దేశంలోనే ఓ ప్ర‌ముఖ పారిశ్రామిక‌వేత్త కూడా ఆయ‌న కొన‌సాగింపున‌కు సిఫార‌సు చేశారు. అంతే..ఆరున్న‌ర సంవ‌త్స‌రాలు దాటిపోయినా శ్రీనివాస‌రాజును అక్క‌డ నుంచి త‌ప్పించాల‌నే అంశాన్ని కూడా ప్ర‌భుత్వం మ‌ర్చిపోయింది. అందుకే ఆయ‌న అక్క‌డ ఇష్టారాజ్యంగా పెత్త‌నం చెలాయిస్తున్నార‌నే విమ‌ర్శ‌లు విన్పిస్తున్నాయి. టీటీడీ జెఈవోగా ఎవ‌రు ఉన్నా అటు సుప్రీంకోర్టు న్యాయ‌మూర్తికి..ఆ పారిశ్రామిక‌వేత్త‌కు స్వామివారి ద‌ర్శ‌నం ద‌గ్గ‌ర ఏ మాత్రం ఢోకా ఉండ‌దు. కానీ వాళ్లు సిఫార‌సులు చేయ‌టం ఏమిటి?...ప్ర‌భుత్వం ఓకే అన‌టం రాజ‌కీయం కాక మ‌రేమిట‌ని ఓ ఉన్న‌తాధికారి వ్యాఖ్యానించారు.

ఈ నాలుగేళ్ళ కాలంలో ఈవోల‌ను మార్చారు కానీ..జెఈవోను మాత్రం చంద్ర‌బాబు క‌దిలించ‌లేక‌పోతున్నారు. ఇటీవ‌లే బాధ్య‌త‌లు చేప‌ట్టిన ఈవో అనిల్ కుమార్ సింఘాల్ నియామ‌కం విష‌యంలోనూ చాలా రాజ‌కీయాలు జ‌రిగాయ‌నే ఆరోప‌ణ‌లు వెల్లువెత్తాయి. సంప్ర‌దాయాలు..ప‌ద్ద‌తుల గురించి నిత్యం వ‌ల్లించే చంద్ర‌బాబు వాటికి తిలోద‌కాలు ఇచ్చి మ‌రీ అనిల్ కుమార్ సింఘాల్ ను టీటీడీ ఈవోగా నియ‌మించారు. ఇదంతా ఒకెత్తు అయితే అత్యంత కీల‌క‌మైన టీటీడీకి సంబంధించి పాల‌క‌మండ‌లి లేక ఆరు నెల‌లు కావస్తోంది. కానీ ఇంత వ‌ర‌కూ సీఎం ఆ వైపే చూడ‌టం లేదు. అదిగో క‌మిటీ ..ఇదిగో క‌మిటీ అంటూ మీడియాకు లీకులు ఇచ్చి హంగామా చేశారు కాని క‌మిటీ మాత్రం ఇంత వ‌ర‌కూ బ‌య‌ట‌కు రాలేదు. టీటీడీకి సంబంధించి ఇంత దారుణ‌మైన ప‌రిస్థితి ఏ ప్ర‌భుత్వంలో కూడా లేద‌ని ఓ ఉన్న‌తాధికారి వ్యాఖ్యానించారు. క‌మిటీ జాప్యం అవుతుంటే క‌నీసం స్పైసిఫైడ్ ఆథారిటీని ఏర్పాటు చేయ‌టం ఆన‌వాయితీ. క‌నీసం చంద్ర‌బాబు ఈ క‌మిటీని కూడా వేయ‌లేదు. తిరుమ‌ల‌ను పూర్తిగా ఈవో..జెఈవో చేతుల్లో పెట్టి వ‌దిలేశార‌ని టీడీపీ వ‌ర్గాలే విస్మ‌యం వ్య‌క్తం చేస్తున్నాయి. ప్ర‌భుత్వంలో చంద్ర‌బాబు మాట‌కు తిరుగులేకున్నా ఎందుకు టీటీడీ ఛైర్మ‌న్, బోర్డు నియామ‌కం చేప‌ట్ట‌డంలేదో అర్థం కాకుండా ఉంద‌ని..రాజ‌కీయాల‌కు ఇచ్చినంత ప్రాధాన్య‌త అత్యంత కీల‌క‌మైన టీటీడీ విష‌యంలో ఇవ్వ‌టంలేద‌ని ఓ అధికారి వ్యాఖ్యానించారు.

Next Story
Share it