రాజమౌళిని చంద్రబాబు అవమానించారా!
ఆంధ్ర్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు టాలీవుడ్ దర్శక దిగ్గజం రాజమౌళిని అవమానించారా?.. అమరావతి రాజధాని డిజైన్ల విషయంలో ఏ మాత్రం జోక్యం చేసుకోవటానికి ఆయన ఆసక్తి చూపించకపోయినా...బలవంతంగా ఇందులోకి దింపి..అందులో ఆయన చేసిన సూచనలు ఏమీ ఆమోదించకపోవటం అంటే ఖచ్చితంగా ఇది అవమానించటమే అని ప్రభుత్వ వర్గాలు కూడా వ్యాఖ్యానిస్తున్నాయి. అసలు రాజధాని డిజైన్ల విషయంలో రాజమౌళిని భాగస్వామిని చేయాలని అనుకున్నప్పుడే పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. అయినా సరే తెలుగుదనం ఉట్టిపడేలా సూచనలు చేయటానికే రాజమౌళిని ఆహ్వానించామని తెలిపారు. సాక్ష్యాత్తూ మంత్రి నారాయణ, సీఆర్ డీఏ ఉన్నతాధికారులు హైదరాబాద్ లో రాజమౌళి ఇంటికెళ్లి మరీ చర్చలు జరిపి వచ్చారు. రాజమౌళి ఓ సారి విడిగా అధికారులతో కలసి లండన్ వెళ్లారు. మరోసారి ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలసి లండన్ వెళ్లారు. అప్పుడే ఇక డిజైన్ల ఖరారు పూర్తవుతుందని తెలిపారు. కానీ అది ఇప్పుడు ఓ కొలిక్కి వచ్చినట్లు కన్పిస్తోంది.
అంతా అయిపోయిన తర్వాత ‘సీన్ కట్’ చేస్తే రాజమౌళి చేసిన సూచనలు, సిఫారసులు ఏవీ కూడా రాజధాని డిజైన్ల ఖరారులో ఉపయోగించలేదు. ఈ విషయాన్ని స్వయంగా రాజమౌళినే మీడియాకు వివరించారు. ‘సినిమా సెట్టింగ్ లు వేరు. రాజధాని వేరు. ఇంటర్మీడియట్ చదివిన నేను రాజధాని నిర్మాణంలో సలహాలు ఏమి ఇవ్వగలను. దేశంలో చాలా మంది మంచి ఇంజనీర్లు ఉన్నారు’. అని ప్రముఖ దర్శకుడు రాజమౌళి ఓ ఇంటర్వ్యూలో స్పష్టంగా చెప్పారు. అయినా సరే ఏపీ సర్కారు కాదు..కూడదు రాజమౌళి ఖచ్చితంగా సలహాలు ఇవ్వాల్సిందే అంటూ పిలిచి ఇలా అవమానించటం ఏమిటనే విమర్శలు విన్పిస్తున్నాయి. రాజమౌళిని అసలు ఇందులో భాగస్వామిని చేయటమే తప్పు అని ఓ భావన ఉండగా...బలవంతంగా ఆయన్ను ఇందులోకి పిలిచి ఆయన సూచనలు..సలహాలను పూర్తిగా విస్మరించటం సహేతుకమైన విధానం కాదని టాలీవుడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.