Telugu Gateway
Andhra Pradesh

చంద్రబాబు ఫెయిల్యూర్స్..ఐఏఎస్ లపై నెట్టే ప్రయత్నం!

ఓ ప్రైవేట్ సంస్థలో కీలక స్థానంలో ఉన్న వ్యక్తి ఆశించిన స్థాయిలో ఫలితాలు చూపించకపోతే ఏం చేస్తారు? కొంత గడువు ఇస్తారు. అయినా సరే మారకపోతే వేటు వేస్తారు. ఇది ఎక్కడైనా జరిగే ప్రక్రియ. కానీ ఏపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన వైఫల్యాలను ఇప్పుడు ఐఏఎస్ లపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ‘మూడేళ్ళ పాటు రాజధానికి డిజైన్లు కూడా ఖరారు చేయలేని వైఫల్యం ఎవరిది?. ఇంత సమయం తీసుకుని చేస్తే అవి రాగానే ‘అహా...అద్బుతం’ అనేలా ఉండాలి. ఎందుకంటే అంత సమయం వెచ్చించారు...అంత ఖర్చు పెట్టారు. కానీ ఎవరో కానీ ఓ ఇడ్లీ పాత్రను..అసెంబ్లీ డిజైన్ ను పక్కన పెట్టి షాక్ ఇచ్చారు. రెండేళ్ళ క్రితం ప్రారంభం కావాల్సిన ఫైబర్ గ్రిడ్ ఇప్పటికి సరైన రీతిలో టేకాఫ్ చేయలేకపోవటంలో విఫలైంది ఎవరు? సోమవారం పేరును పోలవారంగా మార్చాను. పోలవరం పరుగులు పెడుతుంది. గడువులోగా పూర్తి చేస్తాను అని చివరి నిమిషంలో కాంట్రాక్టర్ మార్చాల్సిందే అన్నది ఎవరు?.

పోలవరం ప్రాజెక్టు నుంచి ఆ కాంట్రాక్టర్ ను తప్పిస్తే తప్ప..పని ముందుకు సాగదని చెప్పిన అధికారిని, కాంట్రాక్టర్ కు కొమ్ముకాస్తూ అక్కడ నుంచి తప్పించింది ఎవరు?. నేను పోలవరం ఓ వంద సార్లు వెళ్లాను..వర్చువల్ సమీక్ష 150 సార్లు చేశాను అన్నది ఎవరు?. టీడీపీ ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్ చెప్పినట్లు ఎప్పుడొచ్చామన్నది కాదు అన్నయ్యా...బుల్లెట్ దిగిందా? లేదా అన్నదే ముఖ్యం. మరి చంద్రబాబు సోమవారం పేరును పోలవారంగా మార్చి...సాధించింది ఏమిటి?. పోలవరం పని అయిందా లేదా అన్నదే ముఖ్యం. ఈ వైఫల్యం అధికారులదా?. చంద్రబాబుదా? నిజంగా అధికారులదే తప్పు అయితే ఇప్పటి వరకూ చంద్రబాబు ఎంత మందిపై చర్యలు తీసుకున్నారు. ఒప్పందంలో లేనట్లు కాంట్రాక్టర్లకు కోట్ల రూపాయలు ఇచ్చేయమంటే అధికారులు ఎలా ఇస్తారు. అలా అన్న అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసి..అన్నీ కేబినెట్ లో పెట్టి నిర్ణయాలు తీసుకుంటున్నది ఎవరు?. కేబినెట్ ఉన్నది విధాన నిర్ణయాలు తీసుకోవటానికా?. లేక అక్రమాలు అయినా సరే కేబినెట్ లో ఆమోదిస్తే సక్రమం అయిపోతాయా?. ఒక్క సాగునీటి శాఖలోనే కాదు...ఇంధన శాఖలోనూ ఇలాంటి వింతలు ఎన్నో.

పలు ప్రభుత్వ శాఖల్లో అదే సీన్. చెప్పుకుంటే పోతే చాంతాడంత జాబితా. నిజంగా ఏపీలో ఉన్నతాధికారులు అదే ఐఏఎస్ లు పనిచేయకపోతే చర్యలు తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది కదా?. మరి ఇంత వరకూ ఒక్కరిపై చర్యలు తీసుకోలేకపోయారంటే ఫెయిల్యూర్ ఎవరిది?. ఇఫ్పుడు కొత్తగా ఐఏఎస్ లు హైదరాబాద్ లో ఉంటూ..అమరావతిలో పనిచేస్తున్నారని..ఎవరూ మనసు పెట్టి పని చేయటంలేదనే కొత్త వాదనను తెరపైకి తీసుకొచ్చారు. నిజంగా అది ఐఏఎస్ అయినా...ఎవరైనా సరే పనిచేయకపోతే చర్యలు తీసుకోవాల్సింది ప్రభుత్వమే. మరి పనిచేయనివారిని ఎందుకు వదిలేస్తున్నట్లు. ఇదంతా ఓ కొత్త డ్రామా అని సీనియర్ ఐఏఎస్ అధికారి వ్యాఖ్యానించారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న పనులు చేయని కొంత మంది అధికారులను బెదిరించేందుకే ఈ మార్గం ఎంచుకున్నారని చెబుతున్నారు.

చాలా మంది అధికారులది ఒకటే సమస్య. నిత్యం సమీక్షల్లో పూటలు పూటలు..అదీ సెలవు దినాల్లో పెట్టిన సందర్బాలు ఎన్నో ఉన్నాయి. వాటికి కూడా సెలవులను వదిలేసుకుని హాజరైన సందర్భాలు ఉన్నాయని..ఇప్పుడు కొత్తగా ఐఏఎస్ లు పనిచేయటంలేదనే బ్లేమ్ గేమ్ స్టార్ట్ చేశారని అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. నిబంధనల ప్రకారం చేయాల్సిన పనిచేయకపోతే తప్పుపట్టవచ్చని..తాము ఎప్పుడు...ఎక్కడ ఉండాలో డిసైడ్ చేసుకోగలమని ఓ సీనియర్ అధికారి వ్యాఖ్యానించారు. నిజంగా ఐఏఎస్ లు పనిచేయకపోయినా..చేయించుకోలేకపోయినా ముఖ్యమంత్రిదే ఫెయిల్యూర్ అవుతుంది తప్ప...అధికారులది కాదు.

Next Story
Share it