Telugu Gateway
Andhra Pradesh

లండన్ బాబు...బుసాన్ బాబు!

లండన్ బాబు..ఇప్పుడు బుసాన్ బాబుగా మారిపోయారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఏ దేశం వెళితే ఆ దేశంలో ఆఫీసు పెడతానంటారు. అదేంటి? అంటే పెట్టుబడుల ఆకర్షణ అంటారు. అంతకు ముందు కూడా ఇదే తరహాలో ఏ దేశం వెళితే ఈ దేశం తరహా రాజధాని అంటూ ప్రకటించేశారు. ఇప్పుడు రాజధాని వ్యవహారం పక్కకు పోయి పెట్టుబడుల అంశం ముందుకొచ్చింది. సరిగ్గా 2016 మార్చిలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు లండన్ లో పర్యటించారు. అదే సమయంలో అక్కడ ఆఫీసు ఓపెన్ చేస్తామని ప్రకటించారు. అంతే కాదు..ఏకంగా ఓ ఆఫీసును రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రారంభించేశారు కూడా. అసలు లండన్ లో ఆఫీసు ఏర్పాటుకు ఏపీ సర్కారు కేంద్రం నుంచి అనుమతి తీసుకుందా?. అక్కడ సిబ్బంది వేతనాలు..ఇతర చెల్లింపుల కోసం ఆర్ బిఐ అనుమతి తీసుకుందా? అని అధికారులు అప్పట్లోనే సందేహాలు వ్యక్తం చేశారు. అసలు ఓ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రమేయం లేకుండా ఇలా నేరుగా విదేశాల్లో ఆఫీసులు ఓపెన్ చేయవచ్చా? అని అధికారులే అవాక్కయ్యారు. పోనీ లండన్ లో ఆఫీసు తెరిచి ఏడాదిన్నర కావస్తోంది. పోనీ అక్కడ నుంచి ఇప్పటివరకూ ఒక్క కంపెనీ అయినా వచ్చిందా?. అంటే అదీ లేదు.

పోనీ అమరావతి డిజైన్ల కోసం అంటూ ముఖ్యమంత్రి, మంత్రులు..అధికారుల లండన్ చుట్టూ చక్కర్లు కొట్టారు. మరి అక్కడ ఆఫీసులో ఉన్న వాళ్ళు ఏమి చేస్తున్నట్లు?. అసలు నిజంగా ఇఫ్పుడు అక్కడ ఆఫీసు ఉందా?.లేదా?. ఇదో మిలియన్ డాలర్ల ప్రశ్నగానే ఉంది. ప్రస్తుతం దక్షిణ కొరియా పర్యటనలో ఉన్న చంద్రబాబు మళ్ళీ అదే మోడల్ ఫాలో అవుతున్నారు. ఏపీలో కొరియా పారిశ్రామిక మండలి ఏర్పాటు కానుందన్నారు. అంత వరకూ ఓకే. కానీ చంద్రబాబు ఓ అడుగు ముందుకేసి బుసాన్ లో ఏపీ ఓ సెంటర్ ను ఏర్పాటు చేస్తుందని ప్రకటించారు. అంటే బహుశా అచ్చం లండన్ ఆఫీసు తరహాలోనే కాబోలు. అందుకే లండన్ బాబు..ఇప్పుడు బుసాన్ బాబుగా మారిపోయారంటున్నారు అధికారులు.

Next Story
Share it