Telugu Gateway
Andhra Pradesh

ఏపీలో జిల్లేడు ఆకులు..రేగిపళ్ళకు ఫుల్ డిమాండ్

ఎందుకంటారా?. దీని వెనక బలమైన కారణం ఉంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంగళవారం ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అదేంటో మీరూ చూడండి. సీఎం చంద్రబాబు అమరావతిలో ఉన్నతాధికారులతో సమావేశం అయ్యారు. అందులో ఆయన ఓ సంచలన ప్రతిపాదన చేశారు. అదే ఇది. ‘ జనవరి 24న రథసప్తమి. ఆ రోజున రాష్ట్రవ్యాప్తంగా ఉత్సవం నిర్వహించాలి. మన రాష్ట్రం సూర్యోదయ రాష్ట్రం. సూర్యుడిని ఆరాధించటం అంటే సూర్యశక్తిని మరింత సమర్థవంతంగా వినియోగించుకునేందుకు సంపూర్ణ దృష్టి పెట్టడమే’. ఇదీ ఆయన ప్రకటన సారాంశం. రథసప్తమి సప్తమి రోజున ఎవరి ఇంట్లో వాళ్లు వారి ఆచార, వ్యవహారాలకు అనుగుణంగా స్నానాలు చేశారు. అసలు దీనికి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం ఏమిటి?. రాష్ట్ర వ్యాప్తంగా ఉత్సవం చేయటం ఏమిటి?.ఇవీ అధికారులను వేధిస్తున్న ప్రశ్నలు.

"సూర్యజయంతి" పండుగను "రథసప్తమి" పేరుతో వైభవంగా జరుపుకుంటారు. తులసీకోట పక్కన సూర్యునికి ఎదురుగా అమర్చుకుని ఆవుపాలతో పొంగలి తయారుచేసుకుని, సూర్యప్రతిమ ముందు పూజలు గావించి, చిక్కుడాకులపై పొంగలి ప్రసాదం ఉంచి నివేదన చేస్తారు. ఈ విధంగా సూర్యారాధన చేయడం వల్ల ఆయురారోగ్య ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని పండితులు చెబుతారు. రథసప్తమి రోజున సూర్యభగవానుడిని దర్శించుకుంటే సర్వపాపాలు తొలగిపోయి పుణ్యఫలం సిద్ధిస్తుందని పురాణాల్లో ఉంది. రథసప్తమి రోజు మగవారైతే జిల్లేడు ఆకులను వేసుకుని ఆ నీటితో స్నానం చేయాలి. అదే మహిళలైతే.. చిక్కుడు ఆకులతో స్నానం చేయడం మంచిదని పురోహితుల మాట. కొంత మంది జిల్లేడు ఆకులు, చిక్కుడు ఆకులతో పాటు రేగిపళ్లను భుజాలపైన..తలపైన పెట్టుకుని స్నానం చేస్తారు. ఒక్కో చోట ఈ పద్దతి ఒక్కో రకంగా ఉంటుంది.

Next Story
Share it