అమరావతి అసెంబ్లీకి ‘అదే పైనల్’
ఎట్టకేలకు అమరావతిలో కొత్త అసెంబ్లీ డిజైన్ ఖరారైంది. లండన్ కు చెందిన నార్మన్ ఫోస్టర్ సిద్ధం చేసిన డిజైన్లలో టవర్ డిజైన్ కు ఏపీ మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రి మండలి సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకున్నారు. తుది డిజైన్ అందటంతో నెలన్నరలో ఈ నిర్మాణ పనులకు టెండర్లు పిలవనున్నారు. నీటి కొలను మధ్యలో 250 మీటర్ల వెడల్పు, 250 మీటర్ల పొడవుతో అసెంబ్లీ డిజైన్‌ను నార్మన్ ఫోస్టర్స్ సంస్థ రూపొందించింది. 250 మీటర్ల ఎత్తులో టవర్ ఆకారంలో నిర్మించే ఈ అసెంబ్లీ భవనం నాలుగు అంతస్తుల్లో ఉండనుంది. టవర్‌పైకి 40 మీటర్ల ఎత్తుకు వెళ్లిన తర్వాత వ్యూ పాయింట్ ఉంటుంది. అక్కడి నుంచి 217 చదరపు కిలోమీటర్ల రాజధాని నగరం మొత్తాన్ని వీక్షించవచ్చు. 70 మంది సందర్శకులు ఒకేసారి వ్యూపాయింట్‌కు వెళ్లి రాజధాని నగరాన్ని చూసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ భవనాన్ని నీటి కొలనులో నిర్మిస్తారు. ఈ కొలను 125 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది.
టవర్ ప్రతిబింబం ఈ నీటిలో పడేలా డిజైన్ చేశారు. టవర్ కింది భాగంలో శాసనసభ, శాసనమండలి, సెంట్రల్ హాల్, పరిపాలనా కేంద్రాల భవనాలు ఒకదానితో ఒకటి కలిసి ఉంటాయి. అసెంబ్లీ భవనం మొత్తం 87 వేల చదరపు మీటర్ల ప్రాంతంలో ఉంటుండగా, నిర్మిత ప్రాంతం 7.8 లక్షల చదరపు అడుగుల్లో ఉంటుంది. ఈ భవనంపై పునరుత్పాదక విద్యుదుత్పత్తి వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. సూర్యకాంతి నుంచి విద్యుత్‌ను ఉత్పత్తి చేసే వ్యవస్థను కూడా నెలకొల్పుతారు. మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి ఈ టవర్ డిజైన్‌ను గురించి మంత్రులకు వివరించి అభిప్రాయాలు కోరగా, అయితే చిత్రాల్లో డిజైన్ అంత ఆకర్శణీయంగా లేదని, పెద్ద చిత్రాలను చూపించాలని మంత్రులు కోరారు. కొత్త డిజైన్లపై మంత్రి నారాయణ మీడియా సమావేశంలో మాట్లాడుతూ... పూర్తిస్థాయి స్ట్రక్చరల్ డిజైన్లు ఇచ్చేందుకు ఆరు నుంచి ఎనిమిది వారాల సమయం పడుతుందని ఫోస్టర్స్ ప్రతినిధులు చెప్పినట్లు తెలిపారు. ఈ డిజైన్లు రాగానే టెండర్లు పిలిచి నిర్మాణ పనులు చేపడతామని తెలిపారు.