ప్రచారమే నిజమైంది...అనుష్క..విరాట్ ల పెళ్ళైంది
ప్రచారమే నిజమైంది. లేదు..లేదంటూనే అనుష్క..విరాట్ లు ఒక్కటయ్యారు. కేవలం కుటుంబ సభ్యులు..అత్యంత సన్నిహితుల మధ్యే ఈ వివాహ వేడుక జరిగింది. దీంతో గత కొంత కాలంగా ప్రేమికులు ఉన్న విరాట్..అనుష్క శర్మలు భార్యా,భర్తలు అయిపోయారు. గత వారం రోజులుగా వీరిద్దరి పెళ్లిపై మీడియాలో హంగామా జరుగుతుండగా..ఈ వార్తలను ఖండించారు. కానీ ప్రచారం జరిగినట్లే పెళ్ళే నిజం అయింది. ఇటలీలోని టస్కనీ రిసార్ట్ లో ఈ పెళ్లి వేడుక జరిగింది. మనోర్ హౌజ్‌లోని నాలుగు విల్లాలను ఈ వేడుక కోసం ప్రత్యేకంగా ముస్తాబు చేశారు. హిందూ సంప్రదాయం ప్రకారం వీరిద్దరి వివాహం జరిగింది. త్వరలోనే ఈ జంట ముంబై వర్లీ ప్రాంతంలోని కొత్త ఇంటిలో కాపురం పెడుతుందని అనుష్క సన్నిహితురాలు చెబుతోంది. ప్రేమ కలాపాలతో ‘విరుష్క’గా చిరపరిచితమైన ఇద్దరి వయస్సు 29. నాలుగేళ్ల క్రితం ఓ కమర్షియల్ యాడ్ చిత్రీకరణ సందర్భంగా ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. తర్వాత కాలంలో మరింత బలపడి తాజాగా పెళ్లిదాకా వచ్చింది.
రిసెప్షన్ మాత్రం రెండు నగరాల్లో జరగనుంది. ఈ నెల 21న న్యూఢిల్లీలో తమ బంధువుల కోసం, 26న ముంబైలో క్రికెటర్లకు, వివిధ రంగాల్లోని సెలబ్రిటీలకు రిసెప్షన్ నిర్వహిస్తారు. ఆ మరుసటి రోజే కోహ్లి జట్టుతో కలిసి దక్షిణాఫ్రికా సిరీస్‌కు బయలుదేరుతాడు. తమ పెళ్లి విషయాన్ని ఇద్దరూ ట్విట్టర్ లో షేర్ చేసుకున్నారు. ఈ రోజు (సోమవారం) మేమిద్దరం కలకాలం కలిసుంటామనే పెళ్లి ప్రమాణం చేశాం. ఈ సంతోషాన్ని మీతో పంచుకుంటున్నందుకు ఆనందంగా ఉంది. కుటుంబసభ్యులు, శ్రేయోభిలాషుల ప్రేమాభిమానాలతో ఈ అందమైన రోజు మాకెంతో ప్రత్యేకం. మా పెళ్లి ప్రయాణంలో శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ థ్యాంక్స్. అని విరాట్ కొహ్లి ట్వీట్ చేశారు.