దేశీయ ఐటి నిపుణులకు మరో షాక్
ట్రంప్ వచ్చాడు. దేశీయ ఐటిలో అల్లకల్లోలం మొదలైంది. మా ఉద్యోగాలు మాకే అంటూ ట్రంప్ ఇచ్చిన నినాదం దేశీయ ఐటి రంగ నిపుణులపై తీవ్ర చూపించింది. అమెరికా ఆశలు కల్ల అవతుండగా...దేశీయంగానూ ఐటి రంగంలో ఉద్యోగాల కోత పెరిగింది. వీటన్నింటికి తోడు మరో వైపు ఆటోమేషన్ భూతం ఈ రంగంలోని నిపుణులను వెంటాడుతోంది. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో పిడుగు వేశాడు. ఇది ఖచ్చితంగా ఎంచక్కా అమెరికా వెళ్ళి ఐటి ఉద్యోగం దక్కించుకోవాలని చూసేవారికి షాకింగ్ వార్తే. హెచ్1-బీ వీసా జారీ ప్రక్రియను మరింత కఠితనతరం చేసేందుకు డిపార్ట్ మెంట్ ఆఫ్ హోమ్‌లాండ్ సెక్యురిటీ ప్రతిపాదనలను రెడీ చేస్తోంది. ఇంటర్నేషనల్ ఇమ్మిగ్రేషన్ సంస్థ ఫ్రాగోమెన్స్ తన వెబ్‌సైట్ ఈ విషయాన్ని వెల్లడించింది. 2011లోని ప్రతిపాదనను డీహెచ్‌ఎస్ పునరుద్ధరించాలని సంకేతాలు ఇచ్చింది. ఈ పునరుద్ధరణతో హెచ్-1బీ క్యాప్ లాటరీ కోసం హెచ్1-బీ పిటిషనర్లు ముందస్తుగా రిజిస్ట్రర్ చేసుకోవాల్సి ఉంటుంది. క్యాప్ మెంబర్లను సొంతం చేసుకున్న తర్వాత మాత్రమే క్యాప్ పిటిషన్లను సమర్పించాల్సి ఉంటుంది.
హెచ్1-బీ క్యాప్ మెంబర్లను జారీచేసేటప్పుడు కూడా ప్రాధాన్యతా ప్రక్రియను చేపట్టాలని డీహెచ్‌ఎస్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ మేరకు అధ్యక్షుడు ట్రంప్ 'బై అమెరికన్, హైర్ అమెరికన్' ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ప్రకారం హెచ్1-బీ క్యాప్ మెంబర్లను జారీచేసేటప్పుడు అధిక మొత్తంలో చెల్లించే, ఎక్కువ ప్రతిభావంతులకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వనున్నట్టు తన నివేదికలో పేర్కొంది. హెచ్1-బీ వీసాదారుల భాగస్వామ్యులు అమెరికాలో పనిచేసేందుకు వీలు లేకుండా నిబంధనలు తీసుకురావాలని కూడా ట్రంప్ ప్రభుత్వం చూస్తోంది. ఈ విషయాన్ని డీహెచ్‌ఎస్ అధికారికంగా కూడా ప్రకటించింది. ప్రస్తుతం వెనువెంటనే హెచ్1-బీ పిటిషనర్ల ఎంపికలో కూడా కఠినతరమైన నిబంధనలు తీసుకురావడం భారత టెకీలకు, సంస్థలకు మరింత ప్రతికూలంగా మారబోతుంది.