Telugu Gateway
Andhra Pradesh

అన్నను పక్కన పెట్టి..‘చంద్రన్న భజన’

చంద్రన్న కానుక. చంద్రన్న బీమా. ఇప్పుడు చంద్రన్న విలేజ్ మాల్స్. చంద్రన్న ఏమన్నా వీటిని ఫ్రీగా ఇస్తున్నారా?. లేక అది ఏమైనా ప్రైవేట్ కిరాణా దుకాణమా?. తెలుగుదేశం వ్యవస్థాపకుడు, దివంగత ఎన్టీఆర్ పేరు మీద కూడా ఈ మధ్య కాలంలో ఇన్ని పథకాలు పెట్టలేదు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు. పదవిలో ఉండగా ఓ ముఖ్యమంత్రి తన పేరును ఇన్ని పథకాలకు పెట్టుకోవటం ఇదే మొదటిసారి. తెలంగాణలోనూ ముఖ్యమంత్రి కెసీఆర్ ఓ పథకానికి ‘కెసీఆర్ కిట్’ అనే పెరు పెట్టుకున్నారు. ఏపీలో అయితే ఈ ‘చంద్రన్న’ భజన మరీ ఎక్కువై పోయిందనే విమర్శలు అధికార వర్గాలే నుంచే విన్పిస్తున్నాయి. వ్యవస్థలను నాశనం చేశాడు...ఇష్టానుసారం పాలించారు అని టీడీపీ నేతలు తీవ్ర విమర్శలు చేసిన వైఎస్ పాలనలోనూ రాజశేఖరరెడ్డి తన పేరుతో ఒక్కటంటే ఒక్క పథకం పేరు పెట్టుకోలేదు. అది జాతీయ పార్టీ కాబట్టి అన్నింటికి కాంగ్రెస్ పార్టీకి చెందిన దివంగత నేతలైన ఇందిర, రాజీవ్ ల పేర్లు పెట్టేవారు. ఓ ఇరిగేషన్ పథకానికి వైఎస్ పేరు పెడుతూ జీవో రాగానే అప్పట్లో మీడియా నానా రచ్చచేసింది. వెంటనే వైఎస్ ఆ జీవోను కూడా వెంటనే రద్దు చేయించారు.

కానీ ఇప్పుడు చంద్రబాబునాయుడు తన పేరు మీద ఎన్ని పథకాలు పెట్టుకుంటున్నా ఎవరూ ఏమీ మాట్లాడంలేదు. చంద్రన్న కానుక..చంద్రన్న భీమా, చంద్రన్న విలేజ్ మాల్స్ ఏమైనా ఆయన సొంత డబ్బుతో నడుపుతున్నారా?. ప్రభుత్వ డబ్బులతో నడిచేవాటికి ఆయన సొంత పేరు ఎలా పెట్టుకుంటారు?. అని ఓ సీనియర్ అధికారి ప్రశ్నించారు. ఇది అసలు ఏ మాత్రం అనుమతించతగ్గ వ్యవహారం కాదని..కానీ స్వయంగా చంద్రబాబే అలా వ్యవహరిస్తుంటే ఏ అధికారి ముందకొచ్చి కాదని చెప్పగలరని ప్రభుత్వ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ పేరుతో అన్న క్యాంటీన్లు రాష్ట్రమంతటా పెడతామని పరిటాల సునీత పౌరసరఫరాల శాఖ మంత్రిగా ఉన్న సమయంలోనే ప్రకటించారు. కానీ ఇది ఒక్క అమరావతిలో తప్ప ఎక్కడా ప్రారంభం అయిన దాఖలాలు లేవు. ఎన్టీఆర్ పేరుతో సుజల స్రవంతి రక్షిత మంచినీటి పథకం పెట్టినా అది కూడా అంతంత మాత్రంగానే నడుస్తోంది. చంద్రబాబు తీరుచూస్తుంటే ఎన్టీఆర్ ను అందరూ మర్చిపోయేలా చేసి...తానే ఓ అన్నగా మారేందుకు అన్ని పథకాలకు ఇలా చంద్రన్న పేరు పెట్టుకుంటున్నారని ఓ టీడీపీ నేత వ్యాఖ్యానించారు.

Next Story
Share it