Telugu Gateway
Andhra Pradesh

‘పల్లె’ స్థాయి దాటని ప్రపంచ స్థాయి రాజధాని ‘అమరావతి’

అమరావతి. ప్రపంచ శ్రేణి రాజధాని. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిత్యం చెప్పేమాటలు. కానీ అది ఇప్పటివరకూ ‘పల్లె స్థాయి’ని దాటలేదు. ప్రభుత్వం కోర్ క్యాపిటల్ ఏరియాను అయినా కార్పొరేషన్ గానో.మునిసిపాలిటీగానో ప్రకటిస్తే తప్ప..అక్కడ అభివృద్ధి సాధ్యంకాదని చెబుతున్నారు. రాజధాని ప్రాంతంలో ఇఫ్పటికీ పల్లె వాతావరణమే కన్పిస్తుంది తప్ప..అక్కడ ఎలాంటి డెవలప్ మెంట్ లేదు. ఒకట్రెండు విద్యా సంస్థలు మాత్రం వేగంగా తమ భవనాలను పూర్తి చేస్తున్నాయి. గ్రామకంఠాల విషయాన్ని కూడా ప్రభుత్వం ఇంత వరకూ ఏమీ తేల్చలేదు. ఇది ఎప్పటికి తేలుతుందో తెలియని అనిశ్చిత పరిస్థితి. దీంతో పాటు అసైన్ మెంట్ భూములు..వాగు పోరంబోకు భూములకు సంబంధించి కూడా పలు వివాదాలు ఉన్నాయని స్థానిక రైతులు చెబుతున్నారు. భూములు ఇఛ్చిన రైతులకు సర్కారు ఫ్లాట్ల కేటాయింపు చేస్తున్నా...ఎక్కడ ఏది ఉందో తెలియకపోవటంతో రైతులు తమకు ఈ విషయంలో మరింత స్పష్టత ఇస్తే తప్ప తాము వాటిని తీసుకోమని చెబుతున్నారు. భూములు తీసుకుని మూడేళ్లు కావస్తున్నా ఇంత వరకూ రాజధాని ప్రాంతంలో నిర్మాణ రంగ కార్యకలాపాలు ఏ మాత్రం ఊపందుకోకపోవటంతో అసలు అభివృద్ధి జరగటం లేదని..ప్రైవేట్ డెవలపర్లు రాకుండా అభివృద్ధి సాధ్యంకాదని చెబుతున్నారు. ప్రభుత్వం మాత్రం కేవలం తమకు కావాల్సిన చోట రహదారులు వేసుకుని మిగతా ప్రాంతాలను విస్మరిస్తుందని రైతులు భావిస్తున్నారు.

ఓ వైపు రాజధాని పనులతో పాటు..ప్రైవేట్ సంస్థలు నిర్మాణాలు ప్రారంభిస్తేనే ఈ ప్రాంతం అభివృద్ధి సాధ్యం అవుతుందని..ఇది ఎప్పుడు మొదలవుతుందో తెలియని వాతావరణం ఉందని భూములిచ్చిన రైతులు కూడా ఆందోళన చెందుతున్నారు.మూడేళ్ల నుంచి మాటలు తప్ప...పనులు లేవని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాజధాని పరిధిలోని ఉన్నా అవి ఇంకా పల్లె స్థాయిని దాటి ముందుకు రాలేదు. తమ స్థలాన్ని పెట్టుకుని రుణం తీసుకుని భవనాలు కట్టుకుందామంటే వాటిని గ్రామాలుగానే బ్యాంకులు పరిగణిస్తుండటం పెద్ద ఇబ్బందిగా మారిందని రైతులు చెబుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంతసేపూ సింగపూర్..జపాన్..ఇస్తాంబుల్ అంటారే తప్ప...అసలు 34 వేల ఎకరాల ప్రాంతంలో ఇప్పటివరకూ అసలు నిర్మాణ కార్యకలాపాలు ఊఫందుకోకపోవటం ప్రగతికి పెద్ద ప్రతిబంధకంగా మారిందని చెబుతున్నారు.

Next Story
Share it