‘పద్మావతి’కి అద్వానీ మద్దతు
‘పద్మావతి’ సినిమా విషయంలో బిజెపి సీనియర్ నేత ఎల్ కె అద్వానీ స్పందించారు. ఈ సినిమా విషయంలో ఆయన ఏకంగా దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీకి మద్దతు తెలిపారు. పద్మావతి విషయంలో ఇఫ్పటికే చాలా మంది జోక్యం చేసుకున్నారని..ఇక ప్యానెల్ చేయాల్సింది ఏమీలేదన్నట్లు అద్వానీ ఠాకూర్ కు తెలిపారు. ఇదిలా ఉంటే పార్లమెంటరీ ప్యానల్ సంజయ్ లీలా భన్సాలీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సెన్సార్ చేయకముందే ఈ సినిమాను మీడియాకు ఎలా చూపిస్తారని ప్యానెల్ ఛైర్మన్ అనురాగ్ ఠాగూర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్యానెల్ ముందు భన్సాలీ హాజరయ్యారు. ఈ సమావేశానికి సెన్సార్ బోర్డు చీఫ్ ప్రసూన్ జోషి కూడా హాజరయ్యారు. మీడియాకు సినిమాను చూపించటం ద్వారా భన్సాలీ సెన్సార్ బోర్డును అవమానించారని వ్యాఖ్యానించారు. దీనికి భన్సాలీ సమాధానం ఇస్తూ తనకు అంత కంటే వేరే మార్గం కన్పించలేదని..సినిమాలో ఎలాంటి తప్పులు లేవని చెప్పటానికే ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు వివరణ ఇచ్చారు.
మీడియాకు ప్రత్యేక స్క్రీనింగ్ వేసిన తర్వాత హార్డ్ కోర్ బిజెపి మద్దతుదారుగా ప్రచారంలో ఉన్న సీనియర్ జర్నలిస్ట్ అర్నాబ్ గోస్వామి కూడా పద్మావతికి మద్దతుగా మాట్లాడటమే కాకుండా..కర్ణిసేన ఆందోళనలకు మద్దతు పలకటం ద్వారా బిజెపి తన పరువు పొగొట్టుకోకూడదని వ్యాఖ్యానించారు. ప్రతి సీన్ అద్భుతంగా ఉందని..సినిమా పద్మావతి..రాజ్ పుట్ ల ప్రతిష్టను పెంచేదిగా ఉందే తప్ప..ఎక్కడా వివాదం లేదని అర్నాబ్ వ్యాఖ్యానించారు. పద్మావతి సినిమాపై దేశ వ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనల కారణంగా తాను ఇప్పటికే చాలా నష్టపోయానని...ప్యానెల్ కు భన్సాలీ వివరించారు. పార్లమెంట్ ప్యానెల్ తో భేటీ తర్వాత త్వరలోనే సెన్సార్ బోర్డు తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు.