Telugu Gateway
Telugu

ఆధార్ అనుసంధానంపై సుప్రీం తీర్పు

ఏది కావాలన్నా ఆధార్ తప్పనిసరి అంటున్నారు. చివరకు తిరుమల వెంకన్న స్వామి దర్శనానికి ఆధార్ కార్డు తప్పనిసరి చేశారు. ఫోన్ కూ..బ్యాంకు ఖాతాకు...పని ఏదైనా ఆధార్ ఉండాల్సిందే. ఈ మధ్య విమాన ప్రయాణాలకు కొన్ని చోట్ల ఆధార్ ను తప్పనిసరి చేశారు. ఇంకా ఆధార్ ను తాము పొందే పలు సేవలతో అనుసంధానం చేసుకోలేని వారు టెన్షన్ పడుతున్నారు. వీరందరికీ సుప్రీంకోర్టు ఊరటనిచ్చే తీర్పు వెలువరించింది. ఆధార్ అనుసంధానం గడువును అన్ని సేవలకు మార్చి 31 వరకూ పొడిగింది. ఇది ప్రజలకు పెద్ద రిలీఫ్ కిందే లెక్క. ఆధార్ చట్టం చట్టబద్ధత అంశంపై తదుపరి వాదనలను జనవరి 17వ తేదీకి వాయిదా వేసింది. ప్రధాన న్యాయమూర్తి దీపాక్ మిశ్రా నేతృత్వంలోని అయిదుగురు జడ్జిల బెంచ్ శుక్రవారం ఈ విషయంపై తాత్కాలిక ఉత్తర్వులు జారీ చేసింది.

అన్ని ప్రభుత్వ పథకాలు, బ్యాంకు ఖాతాలు, మొబైల్ ఫోన్ల ఆధార్‌ లింకింగ్‌ గడువును మార్చి 31వ తేదీ వరకు పొడిగిస్తూ సుప్రీం శుక్రవారం తీర్పు వెలువరించింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న వివిధ సంక్షేమ పథకాల లబ్దిదారులకు ఉపశమనం కల్పించింది. అలాగే కొత్త బ్యాంకు ఖాతాలను తెరవడానికి కూడా ప్రస్తుతానికి ఆధార్‌ అనుసంధానం అవసరం లేదని తేల్చి చెప్పింది. ఆధార్‌ నంబర్‌ లేకుండానే బ్యాంకు ఖాతాను తెరవచ్చని స్పష్టం చేసింది. అయితే ఆధార్‌ కార్డుకోసం దరఖాస్తు చేసిన కాపీని జతచేయాలని తెలిపింది. దీంతోపాటు 2018, ఫిబ్రవరి 6వ తేదీతో ముగియనున్న మొబైల్‌ ఆధార్‌లింకింగ్‌ గడువును కూడా మార్చి 31 వరకు పొడిగించింది.

Next Story
Share it