సంచలనం...2జీ స్కామ్ లో రాజా...కనిమమొళి నిర్దోషులే
యూపీఏ ప్రతిష్టను మసకబార్చిన కుంభకోణాల్లో 2జీ కుంభకోణం ఒకటి. ఈ కుంభకోణాన్నిరాజ్యాంగ బద్ద సంస్థ కాగ్ తన నివేదికలో కడిగేసింది. అప్పటి ప్రధాని నరేంద్రమోడీని బైపాస్ చేసి మరీ అప్పటి టెలికం శాఖ మంత్రిగా ఉన్న రాజా పలు నిర్ణయాలు తీసుకున్నారనే విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై అప్పట్లో పెద్ద దుమారమే రేగింది. అయితే ఇప్పుడు ఈ కేసులో రాజా..కనిమొళి నిర్దోషులు అంటూ కోర్టు తీర్పు వెలువరించింది. ఇది పెద్ద సంచలనంగా మారింది. పటియాలా కోర్టు తీర్పుతో డీఎంకే శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం వరుసగా రెండుసార్లు అధికారంలోకి వచ్చిన సమయంలో రెండుసార్లూ మిత్రపక్షమైన డీఎంకేకు కేంద్ర మంత్రివర్గంలో ప్రత్యేక ప్రాధాన్యతే లభించింది. తమ పార్టీ నేతల వ్యాపార అవసరాలకు అనుగుణమైన మంత్రిత్వ శాఖలనే కరుణానిధి పట్టుపట్టి కేంద్రం నుంచి సాధించుకున్నారు. అందులో భాగంగానే డీఎంకేకి చెందిన రాజా టెలికమ్యూనికేషన్ శాఖ మంత్రిగా పనిచేశారు. ఈ సమయంలో 2జీ స్పెక్ట్రం కేటాయింపుల్లో భారీ అవినీతి జరిగినట్లు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. 2జీ స్పెక్ట్రం అక్రమ కేటాయింపుల వల్ల రూ.1.76 లక్షల కోట్లు నష్టం ఏర్పడినట్లు కేంద్ర ప్రభుత్వానికి కాగ్ ఒక నివేదిక సమర్పించింది. భారీ మొత్తంలో కుంభకోణం కావడంతో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) రెండు కేసులు పెట్టింది. అలాగే ఎన్‌ఫోర్సుమెంటు డైరక్టరేట్ (ఈడీ) మరో కేసు నమోదు చేసింది. సీబీఐ పెట్టిన రెండు కేసుల్లో రాజా, డీఎంకే అధినేత కరుణానిధి కుమార్తె, రాజ్యసభ సభ్యురాలు కనిమొళి తదితరులు చిక్కుకున్నారు.
వీరితోపాటు టెలికమ్యూనికేషన్స్ మాజీ కార్యదర్శి సిద్దార్థ్ బెహురా, రాజా మాజీ ప్రయివేటు కార్యదర్శి ఆర్‌కే సంతాలియా తదితర 14 మందిపై చార్జిషీటు దాఖలైంది. పదేళ్ల క్రితం నాటి 2జీ స్పెక్ట్రం కుంభకోణం అప్రతిష్టపాలు చేసిన ఫలితంగా యూపీఏ ప్రభుత్వం గడిచిన పార్లమెంటు ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న వారికి విముక్తి లభించటం పెద్ద ఎత్తున చర్చనీయాంశం అయింది. కోర్టు తీర్పుపై కాంగ్రెస్ పార్టీ కూడా హర్షం వ్యక్తం చేసింది. తమపై విమర్శలు చేసిన వారికి కోర్టు తీర్పు చెంపపెట్టు అని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. ఈ తీర్పుపై బిజెపి ఎంపీ సుబ్రమణ్యస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. పై కోర్టుకు వెళితే ఈ తీర్పు తారుమారు అవుతుందని వ్యాఖ్యానించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే హైకోర్టులో దీనిపై అప్పీల్ చేయాలని సుబ్రమణ్యస్వామి డిమాండ్ చేశారు.