జగన్ కు మరో ఎమ్మెల్యే ఝలక్
పాదయాత్రకు సిద్ధమైన వేళ వైసీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డికి ఆ పార్టీ ఎమ్మెల్యే ఒకరు ఝలక్ ఇచ్చారు. ఆమె వైసీపీకి గుడ్ బై చెప్పి అధికార టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.. తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి శనివారం ఉదయం అమరావతిలో చంద్రబాబునాయుడిని ఆయన నివాసంలో కలిశారు. ఎమ్మెల్యేతో పాటు ఆమె అనుచరులకు చంద్రబాబు పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. వంతల రాజేశ్వరితో కలుపుకుంటే వైసీపీ నుంచి టీడీపీలో చేరిన వారి సంఖ్య 22కి చేరింది.
చంద్రబాబుతో భేటీ అనంతరం రాజేశ్వరి మీడియాతో మాట్లాడుతూ నియోకవర్గ అభివృద్ధి కోసమే తెలుగుదేశంలో చేరినట్లు తెలిపారు. చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని పేర్కొన్నారు. ఫిరాయింపుదారులపై చర్యలు తీసుకుంటే తప్ప..తాము సభకు హాజరుకాబోమని వైసీపీ నిర్ణయం తీసుకుంటే ఈ తరుణంలో కూడా చంద్రబాబు వైసీపీ నుంచి మరో ఎమ్మెల్యేని టీడీపీలో చేర్చుకోవటం కలకలం రేపుతోంది. ఇదే వంతల రాజేశ్వరి గతంలో తనను 20 కోట్ల రూపాయలకు కొనాలని చూశారని ఆరోపించారు.