Telugu Gateway
Cinema

త్రివిక్ర‌మ్‌..దేవిశ్రీ ప్రసాద్ ల మ‌ధ్య విభేదాలు

టాలీవుడ్ లో ఇదే ఇప్పుడు హాట్ టాపిక్. ఒక‌ప్పుడు ఎంతో స‌న్నిహితంగా ఉన్న వీళ్లిద్ద‌రూ విభేదాలు తీవ్ర స్థాయిలో ఉన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. అది ఎంత‌గా అంటే..పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్ప‌లేని ప‌రిస్థితి ఉంది అంటే ప‌రిస్థితి అర్థం చేసుకోవ‌చ్చ‌ని వ్యాఖ్యానిస్తున్నారు. ఈ విభేదాల కార‌ణంతో త్రివిక్ర‌మ్ త‌న సినిమాల్లో దేవిశ్రీ ప్ర‌సాద్ కు ఛాన్స్ లు ఇవ్వ‌టంలేద‌ని..ఇప్పుడు అంతా అనిరుద్ వైపే త్రివిక్ర‌మ్ మొగ్గుచూపుతున్న‌ట్లు చెబుతున్నారు. తాజాగా చోటుచేసుకుంటున్న ప‌రిణామాలు కూడా ఇదే విష‌యాన్ని రూడీచేసేలా ఉన్నాయి. ఒక‌ప్పుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ..దేవిశ్రీ ప్రసాద్ కాంబినేష‌న్ అంటే సూప‌ర్ హిట్లు ఉన్న విష‌యం తెలిసిందే. వీరిద్ద‌రి కాంబినేషన్‌లోనే జల్సా, జులాయి, అత్తారింటికి దారేది, సన్నాఫ్‌ సత్యమూర్తి లాంటి మ్యూజికల్‌ బ్లాక్‌ బస్టర్స్‌ వచ్చాయి. సీన్ క‌ట్ చేస్తే అ..ఆ.. సినిమా నుంచి కొత్త క‌థ మొద‌లైంది.

తొలుత ఈ సినిమాకు అనిరుద్‌ ను సంగీత దర్శకుడిగా తీసుకున్నాడు త్రివిక్రమ్‌. తరువాత అనిరుద్‌ తప్పుకోవటంతో తిరిగి దేవీతోనే మ్యూజిక్‌ చేయిస్తారని అనుకున్నారు. కానీ త్రివిక్రమ్‌ మిక్కీ జే మేయర్‌ ను సంగీత దర్శకుడిగా తీసుకున్నాడు. తాజాగా షూటింగ్ జ‌రుగుతున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, త్రివిక్ర‌మ్ సినిమాలోనూ అనురుదే సంగీత ద‌ర్శ‌కుడు. త్రివిక్రమ్ త్వ‌ర‌లోనే ఎన్టీఆర్‌తో చేయబోయే సినిమాకు కూడా అనిరుద్‌తోనే మ్యూజిక్ చేయించుతాడ‌ని ప్ర‌చారం జ‌రుగుతుండ‌టంతో వీరిద్ద‌రి మ‌ధ్య విభేదాల టాక్‌కు మరింత బలం చేకూరింది. అంతేకాదు కమల్‌ హాసన్‌ల పుట్టిన రోజు సందర్భంగా సోషల్‌ మీడియాలో శుభాకాంక్షలు తెలిపిన దేవీ శ్రీ, అదే రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న త్రివిక్రమ్‌కు శుభాకాంక్షలు తెలుపలేదు. దీంతో త్రివిక్ర‌మ్ శ్రీనివాస్, దేవీశ్రీ ప్ర‌సాద్ ల మ‌ధ్య ఏదో జ‌రిగింద‌ని ప్ర‌చారం జోరుగా సాగుతోంది.

Next Story
Share it