తెలంగాణ రాజకీయం మరింత హాట్ హాట్
Telugu Gateway
Telangana

తెలంగాణ రాజకీయం మరింత హాట్ హాట్

తెలంగాణ రాజకీయాలకు సంబంధించి కీలక పరిణామం. జెఏసీ ఛైర్మన్ కోదండరామ్ చేసిన ప్రకటన రాబోయే రోజుల్లో తెలంగాణ రాజకీయాలను మరింత హాట్ హాట్ గా మార్చటం ఖాయంగా కన్పిస్తోంది. జెఏసీని పూర్తి రాజకీయ పార్టీగా మార్చే అంశంపై త్వరలోనే నిర్ణయం తీసకుంటామని కోదండరామ్ శనివారం నాడు ప్రకటించారు. గత కొంత కాలంగా ప్రజా సమస్యలపై పోరాడేందుకు జెఏసీ ప్రయత్నించటం..ప్రభుత్వం అడ్డుకోవటం జరుగుతోంది. అమరవీరుల స్పూర్తి యాత్ర మొదలుకుని పలు కార్యక్రమాలు చేపట్టినా కోదండరామ్ ను అడుగు ముందుకు వేయకుండా కెసీఆర్ సర్కారు ఆంక్షలు విధిస్తోంది. సమావేశాలకు సైతం అనుమతులు నిరాకరిస్తూ అడ్డుకుంటోంది.

దీంతో పార్టీగా పెట్టాల్సిందిగా కోదండరాంపై ఒత్తిడి పెరుగుతోంది. గత కొంత కాలంగా ఇది సాగుతోంది. ఈ తరుణంలో కోదండరాం ప్రకటన కీలకంగా మారనుంది. శనివారం నాడు జెఏసీ నేతలు నగరంలో సమావేశం అయ్యారు. నిరుద్యోగ సమస్యపై రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, ఈ అంశంపై పోరాడేందుకు ఈ నెల 30న ‘ కొలువుల కొట్లాటసభ’ నిర్వహిస్తామని కోదండరామ్‌ తెలిపారు. కోర్టు అనుమతితోనే ఈ సభను నిర్వహిస్తున్నామని చెప్పారు. మెట్రో ఉద్యోగాల్లో స్థానికులకే అవకాశం కల్పించాలని కోదండరామ్‌ డిమాండ్‌ చేశారు.

Next Story
Share it