అసెంబ్లీలో కెసీఆర్ కీలక ప్రకటన
తెలంగాణ రైతుల విద్యుత్ కష్టాలు తీరినట్లేనా?. ముఖ్యమంత్రి కెసీఆర్ ప్రకటన ప్రకారం అయితే అంతే. ఇక తెలంగాణ లో రైతులకు 24 గంటల పాటు కరెంట్ సరఫరా చేయనున్నట్లు సీఎం కెసీఆర్ బుధవారం నాడు అసెంబ్లీ వేదికగా కీలక ప్రకటన చేశారు. దశాబ్దాల నుంచి విద్యుత్ కష్టాలు అనుభవించిన రైతులకు ఇది ఎంతో తీపి కబురు అని సీఎం వ్యాఖ్యానించారు. చరిత్రలో తొలిసారి 23 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నామని తెలిపారు. నాలుగైదు రోజుల పాటు అధ్యయనం చేస్తామని సీఎం పేర్కొన్నారు. జులై నెల నుంచే పాత మెదక్, కరీంనగర్, నల్లగొండ జిల్లాల్లో 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్న విషయాన్ని సీఎం గుర్తు చేశారు. వచ్చే యాసంగి నుంచి నిరంతర విద్యుత్ అందిచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు.
గతంలో రాష్ట్రంలో 2700 మెగావాట్ల విద్యుత్ లోటు ఉండేదని గుర్తు చేశారు. చిమ్మచీకట్లు అలుముకున్న దుస్థితి నుంచి వెలుగుల రాష్ట్రంగా తీర్చిదిద్దామని స్పష్టం చేశారు. విద్యుత్ పంపిణీ, సరఫరా వ్యవస్థల బలోపేతానికి చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా హైటెన్షన్ లైన్ల సామర్థ్యం పెంచామన్నారు. 11 వేల మెగావాట్ల డిమాండ్‌కు విద్యుత్ సంస్థలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. తెలంగాణ చొరవతో ఉత్తర, దక్షిణ గ్రిడ్ల మధ్య కొత్త లైన్ల నిర్మాణం పూర్తయిందన్నారు. ఈ లైన్ల ద్వారా ఎక్కడి నుంచైనా విద్యుత్ పొందే వీలుందన్నారు.