కెటీఆర్ కు రేవంత్ రెడ్డి ఝలక్
తెలంగాణ మంత్రి కెటీఆర్ కు కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఓ ఝలక్ ఇచ్చారు. టీఆర్ఎస్ లో చేరికల సందర్బంగా మంత్రి కెటీఆర్ బుధవారం నాడు రేవంత్ పై తీవ్ర విమర్శలు చేశారు. రాహుల్ వంటి వాళ్ల వల్లే ఏమీకాదని...రేవంత్ రెడ్డి ఏమి చేస్తాడని వ్యాఖ్యానించారు. అంతే కాదు..రేవంత్ రెడ్డి ఓ ‘స్కాంస్టార్’ అని కెటీఆర్ ఆరోపణించారు. దీనికి రేవంత్ ఫేక్‌బుక్ వేదికగా గట్టి సమాధానం ఇచ్చారు. కేటీఆరే ‘స్కాంస్టార్’ అని కౌంటర్ ఇచ్చారు. తన ఆరోపణలకు రుజువుగా ‘ఇదిగో కేటీఆర్ దాచిన సత్యం’ శీర్షికతో ఒక ఫొటోను ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ చేశారు. సత్యం రామలింగరాజు తనయుడు తేజా రాజుతో పాటు మలేసియా ప్రధాని నజీబ్ రజాక్‌ను కేటీఆర్ కలిసినప్పటి ఫొటోను వెలుగులోకి తెచ్చారు.
‘2016లో జరిగిన అధికారిక పర్యటనలో అనధికారికంగా తేజా రాజుతో మలేసియా ప్రధాన మంత్రిని కలిసిన కేటీఆర్‌కు ముందుంది క్రోకోడైల్ ఫెస్టివల్’ అంటూ కామెంట్ ను కూడా రేవంత్ తన ఫోటోకు జోడించారు. ఓటుకు కోట్లు కేసులో రేవంత్ తెలంగాణ పరువు తీశాడని మంత్రి కేటీఆర్ బుధవారం విమర్శించిన సంగతి తెలిసిందే. ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఈసారి కొడంగల్‌లో టీఆర్‌ఎస్ జెండా ఎగరడం ఖాయమని దీమా వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి తన ఫేస్‌బుక్ పేజీలో కేటీఆర్ ఫొటో షేర్ చేయటం విశేషం. ఈ వ్యవహారం చూస్తుంటే రాబోయే రోజుల్లో ఈ పోరు మరింత ఆసక్తికరంగా మారనున్నట్లు కన్పిస్తోంది.