‘పోలవరం’పై కేంద్ర కమిటీ సంచలన వ్యాఖ్యలు
తెలుగుగేట్ వే.కామ్ చేతిలో కేంద్ర కమిటీ నివేదిక
‘ఎంతో కీలకమైన...భారీ ఖర్చుతో కూడుతున్న పోలవరం ప్రాజెక్టును ఎలా పూర్తి చేయాలో ఏపీ జలవనరుల శాఖకే స్పష్టత లేదు. భారీగా పెరిగిన భూ సేకరణ..ఆర్అండ్ ఆర్ వ్యయంతో ప్రాజెక్టు లాభదాయకతపై కూడా తీవ్ర ప్రభావం పడుతుంది.’ ఇదీ కేంద్ర నిపుణుల కమిటీ తన నివేదికలో పేర్కొన్న అంశాలు. అంతే కాదు..సర్కారు కాఫర్ డ్యామ్ ఎత్తు పెంచాలని నిర్ణయం తీసుకోవటం వివాదస్పదంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం కాఫర్ డ్యామ్ ఎత్తును 31 మీటర్ల నుంచి 42 మీటర్ల ఎత్తుకు పెంచాలని ప్రతిపాదించినట్లు కేంద్ర నిపుణులు కమిటీ తన నివేదికలో కేంద్రానికి నివేదించింది. ప్రాజెక్టును చాలా ముందుగా పూర్తి చేయటానికి ఇలా చేస్తామని చెబుతోందని పేర్కొన్నారు. కాఫర్ డ్యామ్ ఎత్తు పెంపు విషయంలో చాలా అంశాలను పరిశీలించాల్సి ఉందని కమిటీ అభిప్రాయపడింది. 42 మీటర్ల ఎత్తుకు కాఫర్ డ్యామ్ ఎత్తు పెంచాలంటే ఆ మేరకు అవసరమైన భూ సేకరర పూర్తి చేయాలి. 2019 జూన్ నాటికి మొత్తం కెనాల్ డిస్ట్రిబ్యూషన్ పనులను పూర్తి చేయాల్సి ఉందని పేర్కొంది.
ప్రస్తుతం కాఫర్ డ్యామ్ విషయంలో వివాదం తలెత్తటానికి ప్రధాన కారణం ఇదే అని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. పోలవరం ప్రాజెక్టు అమలుకు సంబంధించి ఏపీ జలవనరుల శాఖ సమర్పించిన పీఈఆర్ టి చార్ట్ ను అన్ని కాంపోనెంట్స్ ను పరిగణనలోకి తీసుకుని సవరించాల్సిన అవసరం ఉందని కమిటీ తన నివేదికలో పేర్కొంది. ఒక సారి నిర్దేశిత కమిటీ పీఈఆర్ టి ఛార్ట్ ను ఆమోదించిన తర్వాత దాంట్లో ఎలాంటి మార్పులు చేయకుండా ముందుకు సాగాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వం సమర్పించిన నిర్మాణ కార్యక్రమంలో డిస్ట్రిబ్యూటరీ నెట్ వర్క్ కు సంబంధించి ఎలాంటి వివరాలు అందివ్వలేదని. ప్రాజెక్టు ప్రయోజనం పూర్తిగా రైతులకుచేరాలంటే ఇది చాలా కీలకం అని కమిటీ నివేదించింది. కమిటీకి ప్రభుత్వం పవర్ హౌస్ కాంపోనెంట్స్ నిర్మాణానికి సంబంధించి వివరాలు సమర్పించలేదు. భూసేకరణ, ఆర్అండ్ ఆర్ ఖర్చు భారీగా 2934 కోట్ల రూపాయల నుంచి 32392.24 కోట్ల రూపాయలకు పెరిగిందని రాష్ట్ర ప్రభుత్వం నివేదించినట్లు కమిటీ తెలిపింది.
ఇది మొత్తం ప్రాజెక్టు వ్యయంతోపాటు..ప్రాజెక్టు లాభదాయకత అంశాలపై కూడా తీవ్రంగా ప్రభావం చూపనుందని నివేదిలో పేర్కొన్నారు. జలవనరుల శాఖ నివేదిక ప్రకారం 2010-11 ప్రైస్ లెవల్ ప్రకారం ప్రాజెక్టు వ్యయం 16010 కోట్ల రూపాయలు అయితే...2013-14 ప్రైస్ లెవల్ ప్రకారం ఇది 46,925 కోట్ల రూపాయలకు పెరిగినట్లు నివేదికలో పేర్కొన్నారు. డ్యామ్ దగ్గర క్వాలిటీ కంట్రోల్ ల్యాబ్ ఏర్పాటు చేసి ఈ నాణ్యతా ప్రమాణాలను మరింత సమర్థవంతంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ లో పోలవరం ప్రాజెక్టును క్షేత్రస్థాయిలో పరిశీలించిన నిపుణుల కమిటీ ఈ నివేదికలో పలు అంశాలను ప్రస్తావించింది. ఓ వైపు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తాను సోమవారాన్నిపోలవారంగా మార్చి..వారం వారం సమీక్షిస్తున్నానని ప్రజలకు చెబుతుంటే..మరి కేంద్ర కమిటీ ఏంటి..అసలు ఇంత భారీ ప్రాజెక్టుపై సర్కారుకే స్పష్టత లేదని చెప్పటం ఏంటో?.