Telugu Gateway
Andhra Pradesh

పవన్ కళ్యాణ్ వెనక పోలీసు బాస్!

‘ఆయన కాంగ్రెస్ హయాంలో ఓ వెలుగు వెలిగారు. అవినీతి అంతు చూసే అధికారిగా ‘కలరింగ్’ ఇచ్చుకున్నారు. అంతిమంగా ఆయన అప్పటి అధికార పార్టీ చేతిలో కీలుబొమ్మగా పనిచేశారే తప్ప..‘అవినీతి’ ఆయన ఎజెండా కానేకాదని తేలిపోయింది. కానీ మీడియా సహకారంతో ఆయన ఇమేజ్ అలా పెరిగిపోయింది. తర్వాత పెద్దగా పట్టించుకునే వారే లేకుండా పోయారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం వచ్చాక ఆయనకు పెద్దగా ప్రాధాన్యత లేని పోస్ట్ మాత్రం ఇచ్చారు. ఆయనే ప్రస్తుతం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనధికార రాజకీయ సలహాదారుగా వ్యవహరిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఆయన సలహాల ప్రకారమే పవన్ కదలికలు ఉంటున్నాయని సమాచారం. ఈ వ్యవహారంపై కేంద్రం వద్ద ఓ నివేదిక కూడా ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ఆయనపై ఓ కన్నేసి ఉంచింది.

పవన్ కళ్యాణ్ కొంత కాలం క్రితం బిజెపిపై ఘాటు విమర్శల చేయటం వెనక కూడా ఆయన పాత్ర ఉందని ఢిల్లీ వర్గాలు భావిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ పోలీస్ బాస్ ఆంధప్రదేశ్ లో తరచూ కాలేజీ విద్యార్ధులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ సమావేశాలకు ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి అత్యంత సన్నిహితుడిగా ఉన్న మంత్రి ఒకరు ఈ సమావేశాల వ్యవహారం చూసుకుంటున్నారని చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ కూడా వచ్చే ఎన్నికల్లో ఏపీలోని 175 సీట్లలో బరిలోకి దిగకుండా టీడీపీ పొత్తుతో కేవలం 30 నుంచి 40 సీట్లలోనే బరిలో నిలవాలనే యోచనలో ఉన్నారు. ఇదంతా చూస్తుంటే చాలా ముందస్తు ప్లాన్ ప్రకారమే అంతా ‘వ్యవస్థీకృత రాజకీయం’ జరుగుతున్నట్లు కన్పిస్తోందని ఓ సీనియర్ పోలీస్ అధికారి వ్యాఖ్యానించారు.

Next Story
Share it