Telugu Gateway
Cinema

ప‌ద్మావ‌తి సినిమా..ఆ సీఎంల‌పై సుప్రీం సీరియ‌స్

ప‌ద్మావ‌తి సినిమా దుమారం ఇంకా కొన‌సాగుతూనే ఉంది. దీనికి సంబంధించి మంగ‌ళ‌వారం నాడు కీల‌క ప‌రిణామం చోటుచేసుకుంది. సుప్రీంకోర్టు ఏకంగా కొంత మంది సీఎంల తీరుపై తీవ్ర వ్యాఖ్య‌లు చేసింది. వీరి ప‌ద్ద‌తి కూడా ఏ మాత్రం బాగాలేద‌ని మంద‌లించింది. ఈ సినిమా విడుదలపై స్టే విధించాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు మంగళవారం కొట్టివేసింది. ‘పద్మావతి’ సినిమా విడుదలపై సెన్సార్‌ బోర్డు నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. ‘పద్మావతి’ సినిమాను తెరకెక్కించినందుకు దర్శక, నిర్మాతలపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలంటూ దాఖలైన పిటిషన్‌ను సైతం న్యాయస్థానం కొట్టివేసింది. ఈమేరకు అర్థంలేని వ్యాజ్యం వేసినందుకు పిటిషనర్‌పై ఆగ్రహం వ్యక్తంచేసింది. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండి.. సెన్సార్‌ బోర్డు (సీబీఎఫ్‌సీ) సర్టిఫై చేయకముందే ఒక సినిమాపై ఎలా వ్యాఖ్యలు చేస్తారని సీఎంల‌ను త‌ప్పుప‌ట్టింది.

సినిమా విడుదల కాకముందే ఎలా తీర్పు చెప్తారని నేతలను సుప్రీంకోర్టు ప్ర‌శ్నించింది. ఇలా తీర్పు చెప్పడం వల్ల సీబీఎఫ్‌సీ బోర్డు నిర్ణయం ఇది ప్రభావం చూపే అవకాశముందని, ఈ విషయంలో నేతలు చట్టాలు, నిబంధనలకు కట్టుబడి వ్యవహరించాలని సూచించింది.ప్రముఖ దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ తెరకెక్కించిన ‘పద్మావతి’ సినిమాను ఇప్పటికే మధ్యప్రదేశ్‌, గుజరాత్‌ రాష్ట్రాలు నిషేధించిన సంగ‌తి తెలిసిందే. రాణి పద్మావతి కథ ఆధారంగా తెరకెక్కిన ’పద్మావతి’ సినిమాలో చరిత్రను వక్రీకరించారని, ఈ సినిమాను నిషేధించాలంటూ జోరుగా రాజ్‌పుత్‌లు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రాణీ పద్మిని, అల్లావుద్దీన్‌ ఖిల్జీల మధ్య ఓ ప్రేమగీతాన్ని చిత్రీకరించారని ఆరోపిస్తూ కర్ణిసేన నేతృత్వంలో రాజ్‌పుత్‌లు ఆరోపిస్తున్నారు.

Next Story
Share it