Telugu Gateway
Telangana

‘మత్తు’లో తెలంగాణ డ్రగ్స్ కేసు!

తెలంగాణలో సంచలనం రేపిన ‘డగ్స్ కేసు’ కూడా ‘మత్తు’గా పడుకుందా?. అంటే అవునంటున్నాయి ఎక్సైజ్ శాఖ వర్గాలు. తెలంగాణలో సెలబ్రిటీలు..స్కూలు పిల్లలు ‘డ్రగ్స్’ వాడకం వ్యవహారం ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలుసు. ఈ కేసు వెలుగులోకి వచ్చిన సమయంలో ఎంత పెద్ద వాళ్ళు ఉన్నా వదిలేది లేదు అని ప్రకటించారు తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్. అసలు ఈ కేసు విచారణ జరుగుతున్న తీరుపైనే అప్పట్లో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఇటీవలే సీనియర్ ఐపీఎస్ అధికారి సీ వీ ఆనంద్ కూడా ఓ వెబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్య్వూలో అసలు డ్రగ్స్ కేసు డీల్ చేసిన విధానమే సరిగాలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంత హైప్ వస్తే ఏ కేసు అయినా అలాగే క్లోజ్ అవుతుందని, అన్ని మార్గాల నుంచి ఒత్తిళ్లు వస్తాయని వ్యాఖ్యానించారు. డ్రగ్స్ కేసు విచారణ తీరును వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అయితే తీవ్రంగా తప్పుపట్టారు. ఎక్సైజ్ అధికారులు పేర్లు లీక్ చేయటంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఈ వివాదాలు ఎలా ఉన్నా..ఈ కేసు మొదలై..విచారణ పూర్తయి దాదాపు తొంభై రోజులు పూర్తికావస్తున్నా ఇంత వరకూ ఒక్క చార్జిషీట్ కూడా దాఖలు చేయకపోవటంతో ఈ కేసు సాగుతున్న తీరుపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ కేసులో అసలు ఎవరిని సాక్ష్యులుగా పెట్టాలి...ఎవరిని నిందితులుగా పెట్టాలి అన్న అంశంపైనే తర్జనభర్జనలు సాగుతున్నాయని చెబుతున్నారు. ముఖ్యంగా ఈ డ్రగ్స్ కేసులో టాలీవుడ్ రంగానికి చెందిన ప్రముఖుల పేర్లు తెరపైకి రావటంతో ఒక్కసారిగా కలకలం రేగింది. టాలీవుడ్ కు చెందిన నటులు, దర్శకులు కొంత మంది డ్రగ్స్ వాడటంతో పాటు అమ్మకాలు కూడా చేస్తున్నారని ఆరోపణలు విన్పించాయి. తెలంగాణ సర్కారు ఏర్పాటు చేసిన సిట్ టీమ్ నటులు అందరినీ విచారించింది. వారి వాంగ్మూలాలను కూడా వీడియో రికార్డు చేసింది. నగరంలోని పలు స్కూళ్లలో ‘డ్రగ్స్’ వాడకం ఉందని సిట్ గుర్తించింది. అప్పట్లో హడావుడి అయితే చేశారు కానీ..ఇప్పుడు అంతా సైలంట్ అయిపోయింది. కేవలం మియాపూర్ భూ స్కామ్ నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే సర్కారు డ్రగ్స్ కేసుకు ఇంత హంగామా చేస్తుందని అప్పట్లోనే విపక్షాలు ఆరోపించిన సంగతి తెలిసిందే.

Next Story
Share it