ఎన్టీఆర్ కు అభినందనలు చెప్పటం లోకేష్ కు ఇష్టం లేదా?
అది కావాలని చేసిన పనా? లేక పొరపాటా?. కారణం ఏమైనా నారా లోకేష్ చేసిన పని మాత్రం సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ మారింది. అసలే జూనియర్ ఎన్టీఆర్, నారా లోకేష్ ల మధ్య సంబంధాలు అంతంత మాత్రమే. అయితే తెలుగుదేశం అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే తన కొడుకు రాజకీయ భవిష్యత్ కు ఎక్కడ అడ్డం వస్తాడనే కారణంతో వ్యూహాత్మకంగానే ఎన్టీఆర్ పక్కన పెట్టాడనేది రాజకీయ వర్గాల్లో ఎప్పటి నుంచో నలుగుతున్న అంశం. అవసరం ఉన్నప్పుడు ఎన్టీఆర్ ను రాష్ట్రమంతా తిప్పి ప్రచారం చేయించుకుని తర్వాత పూర్తి వదిలేశారు. ఇదంతా గతం. తాజాగా జరిగిన సంఘటన టీడీపీ, సినీ వర్గాల్లో కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. ఏపీ ప్రభుత్వం మంగళవారం నాడు మూడు సంవత్సరాలకు నంది అవార్డులు..ఇతర జాతీయ అవార్డులు కూడా ప్రకటించింది. 2016 సంవత్సరానికి గాను ఎన్టీఆర్ కు జనతా గ్యారేజ్ సినిమాకు ఉత్తమ నటుడు అవార్డు వచ్చింది. నంది అవార్డు గ్రహీతలకు లోకేష్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా అభినందనలు తెలిపారు.
అందులో నంది అవార్డు విజేతలు అందరికీ అభినందనలు అంటూ 2014, 2015 సంవత్సరాలను మాత్రమే ప్రస్తావించారు. ఎన్టీఆర్ కు అవార్డు వచ్చింది 2016 సంవత్సరానికి కావటం విశేషం. ఎన్టీఆర్ నేషనల్ అవార్డ్స్ విషయంలో నారా లోకేష్ వెరైటీగా 2015, 2016 సంవత్సరాలను ప్రస్తావించారు. ఈ సంవత్సరాలకు గాను వరసగా రాఘవేంద్రరావు, రజనీకాంత్ ల ఎన్టీఆర్ జాతీయ పురస్కారాలు ప్రకటించారు. 2014 సంవత్సరానికి ఇదే అవార్డును తమిళ సూపర్ స్టార్ కమలహాసన్ కు ఇచ్చారు. ఈ ఏడాదిని కూడా లోకేష్ వదిలేశారు. కమలహాసన్ కు అభినందనలు తెలిపితే ప్రధాని మోడీకి ఎక్కడ కోపం వస్తుందో అని వదిలేసినట్లు ఉన్నారని కొంత మంది టీడీపీ నేతలే జోకులు పేలుస్తున్నారు కమల్ అవార్డు వచ్చిన 2014 సంవత్సరాన్ని..జూనియర్ ఎన్టీఆర్ కు అవార్డు వచ్చిన 2016ను లోకేష్ విస్మరించటం పొరపాటా? లేక కావాలని చేసిన పనా అన్న అంశం తేలాలంటే ఆయనే క్లారిటీ ఇవ్వాలి మరి.