Telugu Gateway
Andhra Pradesh

మరి తెలంగాణలో లోకేష్ టీడీపీకి ఓట్లు అడగరా?

తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేష్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. నంది అవార్డుల వివాదంపై స్పందిస్తూ ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అసలు ఏపీలో ఓటు హక్కు..ఆధార్ కార్డు లేని వారు హైదరాబాద్ లో కూర్చుని విమర్శిస్తున్నారని..అసలు అవార్డులే ఇవ్వని వారి గురించి మాట్లాడరని..ఏదైనా మీరు తెలంగాణలో మాట్లాడుకోండని ఘాటుగా వ్యాఖ్యానించారు. అంతే కాదు..హైదరాబాద్ లో కూర్చుని మాట్లాడే వారు ఎన్ ఆర్ ఐల తరహాలో నాన్ రెసిడెంట్ ఆంధ్రాస్ (ఎన్ఆర్ఏ) అని వ్యాఖ్యానించారు. అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడిన తర్వాత మీడియా ప్రతినిధులతో మాట్లాడిన సమయంలో లోకేష్ ఈ వ్యాఖ్యలు చేశారు. గత జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో తాను తెలంగాణలోనే పుట్టానని బహిరంగంగా వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. మరి తెలంగాణలో నిన్న మొన్నటి వరకూ ఓటు హక్కు కలిగిన నారా లోకేష్ ఏపీలో సాక్ష్యాత్తూ మంత్రి కావొచ్చు కానీ..హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు విమర్శలు చేయటానికి అర్హులు కారా?. ఎక్కడ ఉన్నా చేసే విమర్శల్లో తప్పు ఉంటే ఖచ్చితంగా ఎత్తిచూపొచ్చు. అది నంది అవార్డుల అంశం అయినా..మరో అంశం అయినా?. ఎంత బలంగా ఉంది...ఎలా ఉంది అన్న అంశం పక్కన పెడితే తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీ ఉంది కదా.

మరి ఈ లెక్కన రేపు ఎన్నికల్లో తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ లు తెలంగాణలో టీడీపీకి ఓట్లు అడగరా?. అసలు విమర్శలు చేయటానికి ఆధార్ కార్డు..ఓటర్ కార్డు లెక్కేంటి?. లోకేష్ తన వ్యాఖ్యల ద్వారా తెలంగాణ టీడీపీ నేతలకు ఏమి సంకేతం పంపుతున్నారు?. టీడీపీ భవిష్యత్ నేతగా చెబుతున్న లోకేష్ ఏ మాత్రం ఆలోచించకుండా ఇలాంటి వ్యాఖ్యలు చేయటంపై టీడీపీ వర్గాల్లో కూడా చర్చ జరుగుతోంది. లోకేష్ వ్యాఖ్యలు అప్పుడే ఫేస్ బుక్ లో దుమారం రేపుతున్నాయి. హెరిటేజ్ ఫుడ్స్ హెడ్ ఆఫీస్ ను ఎప్పుడు హైదరాబాద్ నుంచి విజయవాడకు మార్చేస్తున్నారు?. నారా దేవాన్ష్ ను విజయవాడలో ఏ స్కూల్లో చేర్పిస్తున్నారు. ఏపీలో అసలు చంద్రబాబు..నారా లోకేష్ ఇళ్ళు ఎప్పుడు కట్టుకుంటారు? అంటూ నెటిజన్లు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. అదేమి విచిత్రమే కానీ లోకేష్ మాట్లాడాటంటే చాలు..మీడియాకు కావాల్సినంత మేత.

Next Story
Share it