Telugu Gateway
Andhra Pradesh

మోడీతో సఖ్యతతో బాబు సాధించింది ఏమిటి?

‘మేం కేంద్రం నుంచి బయటికొస్తే జగన్ అందులో దూరాలని చూస్తున్నాడు. అందుకే కావాలని ప్రత్యేక హోదాపై ప్రజలను రెచ్చగొడుతున్నాడు. ఏదైనా కేంద్రంతో సఖ్యతతో ఉండి సాధించుకోవాలి. పోరాడితే ఏమి వస్తుంది?. అందుకే మేం కష్టాల్లో ఉన్నా కేంద్రానికి మద్దతు ఇస్తున్నాం’. ఇవి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పదే పదే చెప్పిన మాటలు. నిజమే మంచిగా ఉంటే రాష్ట్రానికి మేలు జరిగితే నిజంగానే చంద్రబాబు హీరోగా మిగిలిపోతారు. మోడీతో మంచిగా ఉండి రాష్ట్రానికి ఎంతో మేలు చేశారని. కానీ మోడీతో సఖ్యతతో ఉండి ఇప్పటి వరకూ రాష్ట్రానికి చంద్రబాబు సాధించింది ఏమిటి?. అంటే ఖచ్చితంగా జీరో అని చెప్పొచ్చు. ఏపీ సీఎం చంద్రబాబు కూడా కేంద్రం భాషలో హోదా వేస్ట్...ప్యాకేజీ బెస్ట్ అని పల్లవి అందుకున్నారు. అప్పటికి ఆ అవసరం గడిచిపోయింది. ఈ మధ్యే ప్యాకేజీ కింద రావాల్సిన నిధులు కూడా రావటంలేదని సాక్ష్యాత్తూ చంద్రబాబే విలేకరుల సమావేశంలోనే వాపోయారు. పోనీ హోదా..ప్యాకేజీని పక్కన పెడితే ఇంకా ఏమైనా అదనపు రాయితీలు..ప్రయోజనాలు అందుతున్నాయా? అంటే అదీ లేదు. పోలవరం విషయంలోనూ కేంద్రం పెట్టే మెలికలు అన్నీ ఇన్నీ కావు. కొన్ని రాష్ట్ర ప్రభుత్వ స్వీయతప్పిదాలు కూడా ఉన్నాయనుకోండి. అసలు జాతీయ ప్రాజెక్టు అని ప్రకటిస్తే ఎంత ఖర్చు అయితే అంత కేంద్రమే భరించాలి. అందులో ‘బేరాల’కు తావుండదు. కానీ కేంద్రం 2014 రేట్ల ప్రకారమే మేం ఇస్తామంటే చంద్రబాబు సై సై అన్నారు.

ఎందుకంటే పనులు చేసే బాధ్యత తమకు అప్పగించింది కాబట్టి..అందులో ఆయనకు ప్రయోజనం ఉంది కాబట్టి. లేకపోతే కేంద్రం చేయాల్సిన పనిని అసలు రాష్ట్ర ప్రభుత్వం ఎలా చేపడుతుంది అన్నదే ఓ పెద్ద ప్రశ్న. ఇది ఇప్పట్లో తెమిలేలా? లేదు. మరి చంద్రబాబు కేంద్రంతో అంత సఖ్యతగా ఉండి పొందిన అదనపు ప్రయోజనం ఏమిటి?. అదనపు సంగతి పక్కన పెడితే రావాల్సిన ప్రయోజనాలు కూడా రావటం లేదు. అయినా చంద్రబాబు గట్టిగా మాట్లాడే పరిస్థితి లేదు. రాష్ట్ర విభజన సమయంలో చెప్పినట్లు విశాఖకు రైల్వే జోన్ ఇచ్చారా?. విభజన చట్టంలో ఉన్న అసెంబ్లీ సీట్లు పెంచారా?. రాజధాని నిర్మాణానికి ఏమైనా అదనపు నిధులు కేటాయించారా? అంటే ఏమీలేదు. ఇవన్నీ ఒకెత్తు అయితే ప్రధాని నరేంద్రమోడీ గత కొంత కాలంగా చంద్రబాబునాయుడికి కనీసం అపాయింట్ మెంట్ కూడా ఇవ్వటం లేదు. ఈ విషయం ఢిల్లీలోని అధికార వర్గాల్లో పెద్ద హాట్ టాపిక్ గా మారిపోయింది. ఏ సీఎంకూ గతంలో ఇంతటి పరాభవం జరగలేదని ఓ సీనియర్ అధికారి వ్యాఖ్యానించారు.

Next Story
Share it