Telugu Gateway
Telangana

కెసీఆర్ వల్లే మెట్రో రెండేళ్ళు జాప్యం

తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ వల్లే హైదరాబాద్ లో మెట్రో రైలు ప్రాజెక్టు రెండేళ్లు జాప్యం అయిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. దీని వల్ల వ్యయం కూడా భారీగా పెరిగిందని తెలిపింది. అసెంబ్లీ ముందు మెట్రో రైలు పోవటానికి వీల్లేదు...పక్కనే తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నం ఉంది..సుల్తాన్ బజార్ హైదరాబాద్ చరిత్ర అంటూ ఎన్నో మాటలు చెప్పిన కెసీఆర్ మరి ఇప్పుడు ఎందుకు మౌనంగా అదే రూట్ కు అంగీకరించారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. అప్పుడేమో చారిత్రక భవనాలు..అదీ ఇదీ అని మాటలు మాట్లాడిన కెసీఆర్ ఇఫ్పుడు మెట్రో ప్రాజెక్టు తమదే అన్నట్లు గొప్పలు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ పాలన వచ్చాక ఒక్క అడుగు మెట్రో రైలు కొత్త మార్గం ఏర్పాటు చేశారా? అని ప్రశ్నించారు. కెసీఆర్ తాను చేసిన తప్పిదాలకు హైదరాబాద్ ప్రజలకు క్షమాపణలు డిమాండ్ చెప్పాలని డిమాండ్ చేశారు. కెసీఆర్ చేసిన జాప్యం వల్ల ప్రాజెక్టుపై 4000 కోట్ల రూపాయల అదనపు భారం పడిందన్నారు. ఈ మొత్తాన్ని ఛార్జీల రూపంలో వసూలు చేసుకునేందుకు అనుమతి ఇచ్చిందని తెలిపారు.

ఆదివారం నాడు ఇందిరా భవన్‌లో మెట్రో రైలు ప్రాజెక్టుకు సంబంధించి ఆదివారం పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మెట్రో రైలు ప్రజల ప్రాజెక్ట్‌ అని తెలిపారు. ప్రాజెక్టు ప్రారంభానికి ప్రధాన ప్రతిపక్షాన్ని పిలవక పోవటం దారుణమని చెప్పారు. సీఎం కేసీఆర్‌, ఆయన కుమారుడు మంత్రి కేటీఆర్‌ గొప్పలకు పోతున్నారని ఎద్దేవా చేశారు. మెట్రో రైల్‌ కాంగ్రెస్‌ పార్టీ గొప్పతనమని ఆయన అన్నారు. 2014 డిసెంబర్‌ నాటికే ఇది ప్రజలకు అందుబాటులోకి రావాల్సి ఉన్నా కేసీఆర్‌, టీఆర్ఎస్‌ తుగ్లక్‌ చర్యల కారణంగా ఆలస్యమైందని ఆరోపించారు. పాతబస్తీలో మెట్రో రైల్‌ ఎందుకు ఆగిపోయిందో సమాధానం చెప్పాలని ఉత్తమ్‌ డిమాండ్‌ చేశారు. తెలంగాణలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ ఏర్పాటైన తర్వాత గవర్నర్‌ ప్రసంగంలోనే అలైన్‌మెంట్‌ మార్పును ప్రస్తావించారన్నారు. అప్పుడు మెట్రోకు అడ్డుపడిన వాళ్లే ఇప్పుడు గొప్పతనంగా చెప్పుకుంటున్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ తెలిపారు. టీపీసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఇప్పటికీ ఈ ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుందో క్లారిటీలేదని..సర్కారు ఒకటి చెబుతుంటే ఎల్ అండ్ టి మెట్రో రైలు మరో మాట చెబుతోందని శ్రవణ్ విమర్శించారు.

Next Story
Share it