‘అమరావతి’లో అవినీతి చూసి ఆ అధికారి పరార్
మొక్కల్లోనూ కోట్లు బొక్కేస్తున్నారు
ఆయన ఓ రిటైర్డ్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) అధికారి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయనకు కన్సల్టెంట్ కింద రెండు లక్షల రూపాయలకు పైనే జీతం..కారు..సకల సౌకర్యాలు కల్పించింది. ఉద్యోగం కూడా వారంలో కేవలం ఐదు రోజులే. కానీ అక్కడ జరిగే అవినీతి చూసి ఆయన షాక్ కు గురయ్యారు. అంతే కాదు..ఇక్కడే ఉంటే కటకటాల పాలు కావాల్సి వస్తుందని భయపడి..బాబోయ్ మీ జీతం వద్దు...ఉద్యోగం వద్దు అని పారిపోయారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఊహించుకోవచ్చు. ఈ వ్యవహారం ఇప్పుడు అమరావతి డెవలప్ మెంట్ కార్పొరేషన్ (ఏడీసీ)లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఈ ఏడీసీకి ఛైర్ పర్సన్ గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి లక్ష్మీపార్థసారధి వ్యవహరిస్తున్నారు. అమరావతిలో భారీ ఎత్తున సర్కారు మొక్కలు పెంచాలని నిర్ణయించారు. అందులో భాగంగా ఉద్యోగం మానేయటానికి ముందు ఆ రిటైర్డ్ ఐఎఫ్ ఎస్ అధికారి మొక్కల కోసం టెండర్లు పిలిచారు.
ఒక్కో మొక్క ధరను 150 రూపాయలు గా నిర్ణయించారు. అయితే నిర్దేశిత ధర కంటే పది శాతం తక్కువ ధరకే కోట్ చేస్తూ ఓ కంపెనీ ముందుకొచ్చింది. అయితే ఆ ధర ఏడీసీ ఛైర్ పర్సన్ లక్ష్మీపార్థసారధికి నచ్చలేదు. ఇంత చీప్ గా ఇస్తే ఎవరూ రారని..ధర పెంచాలని సూచించారు. వాస్తవానికి ఒక్కో మొక్కకు 150 రూపాయల ధరే చాలా ఎక్కువ అని అటవీ శాఖ వర్గాలు చెబుతున్నాయి. కానీ లక్ష్మీపార్ధసారధి ఏకంగా మొక్క రేటును 300 రూపాయలకు పెంచి టెండర్లు పిలిచారు. 150 రూపాయల ధరకే పది శాతం తక్కువ కోట్ చేయగా..300 రూపాయల రేటుపై మాత్రం ఎక్సెస్ రేట్లకు టెండర్లు ఇచ్చేశారు. ఈ రేటు పెంపునకు ‘అంతర్జాతీయ ప్రమాణాలు’ అని కొత్త పదం జోడించారు. మొక్కలకు అంతర్జాతీయ ప్రమాణాలు ఏముంటాయి?.
భారతదేశంలో పెరిగే మొక్కలు ఒక రకంగా..విదేశాల్లో పెరిగే మొక్కలు మరో రకంగా ఉంటాయి. అంతే కానీ..వీటికి అంతర్జాతీయ ప్రమాణాలు ఏముంటాయి అన్నది ఏడీసీలోని అధికారుల వాదన. అంటే దీనర్థం అందరూ కలసి ‘మొక్కల్లోనూ కోట్లు బొక్కేయాలని ప్లాన్ వేశారు’ అన్నది స్పష్టంగా అర్థం అవుతోంది. ఓ మంత్రికి చెందిన బినామీ కంపెనీలు..ఇతర పెద్దలు అందరూ కలిసే ఈ కథ నడిపిస్తున్నారని ఏడీసీ వర్గాలు చెబుతున్నాయి. అమరావతిలో గ్రీన్ డెవలప్ మెంట్ ప్రాజెక్టు కింద 1484 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలని నిర్ణయించారు. అంటే ఈ లెక్కన మొక్కల కోసం అసలు ఖర్చు పెట్టేది...ఆ పేరుతో నొక్కేసేది ఎంతో ఇక మీరే లెక్కేసుకోండి. అయితే ఈ అక్రమాల దందా వెనక ఒక్క లక్ష్మీపార్ధసారధే కాకుండా..పెద్దల ప్రమేయం కూడా ఉందని ఏడీసీ అధికారులు చెబుతున్నారు. అసలు ఓ రిటైర్డ్ అధికారికి వేల కోట్ల రూపాయల పనులు అప్పగించమే సరికాదని..ఇప్పుడు లక్ష్మీపార్ధసారధి కార్యాలయంలో ‘కాంట్రాక్టర్ల’దే రాజ్యం నడుస్తోందని ఏడీసీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.