టీఆర్ ఎస్ లో కొండా సురేఖ కలకలం
అధికార టీఆర్ ఎస్ లో రాజకీయ ప్రకంపనలు మొదలవుతున్నాయి. ఓ వైపు ఖమ్మం జిల్లాలో మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు పార్టీకి గుడ్ బై చెప్పారు. ఇది జరిగిన కాసేపటికే వరంగల్ జిల్లాకు చెందిన కొండా సురేఖ కూడా పార్టీని వీడుతున్నారని ప్రచారం మొదలైంది. టీఆర్ ఎస్ అధికారంలోకి వచ్చాక ఆమె తనకు మంత్రి పదవి ఖచ్చితంగా వస్తుందని భావించారు. కారణాలు ఏమిటో తెలియదు కానీ..సురేఖకే కాదు..మంత్రివర్గంలో ఒక్క మహిళకు కూడా చోటు దక్కలేదు. గత కొంత కాలంగా కొండా దంపతులు సర్కారు తీరుపై కొంత అలకపూనినట్లు ప్రచారం జరుగుతోంది. దీనికి తోడు బద్ద శత్రువు అయిన ఎర్రబెల్లి కూడా టీ ఆర్ ఎస్ లో నే చేరారు. వీళ్లకు మొదటి నుంచి గ్రూపు తగాదాలు ఉన్న విషయం తెలిసిందే.
కాంగ్రెస్ హయాంలో ఓ వెలుగు వెలగటమే కాకుండా జిల్లాను శాసించిన కొండా సురేఖ కుటుంబం మూడేళ్ళ కాలంలో నియోజకవర్గానికి పరిమితమయ్యారు. వరంగల్ జిల్లాలో గత నెలలో టిఆర్ఎస్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావుకు కొండా సురేఖ వర్గానికి మధ్య వార్ నడిచింది. రెండు వర్గాల మధ్య వివాదాలేఉ మొదలయ్యాయి. అయితే తాము తగ్గేదే లేదని కొండా సురేఖ వర్గం హెచ్చరించింది. తాజాగా జరుగుతున్న పరిణామాల్లో భాగంగా కొండా దంపతులు పార్టీ మారతారనే ప్రచారం మొదలైంది. అయితే ఈ వార్తలను కొండా సురేఖ ఖండించారు. కాంగ్రెస్ లో కొంత మంది నేతలు కావాలనే ఈ ప్రచారం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. అయితే రాబోయే రోజుల్లో ఈ రాజకీయం ఎన్ని మలుపులు తిరుగుతుందో వేచిచూడాల్సిందే.