రవిప్రకాష్, నరేంద్ర చౌదరి కొత్త ప్రాజెక్టు
మీడియా రంగంలోని ముఖ్యులైన రవి ప్రకాష్, ఎన్టీవీ చౌదరి కొత్త ప్రాాజెక్టు ప్రారంభించబోతున్నారు. వీరితో కొడాలి వెంకటేశ్వరరావు కూడా భాగస్వామి అయ్యారు. వీరు ముగ్గురూ కలసి ప్రారంభించిన సంస్థే ఈ 11 ఈవెన్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్. పది లక్షల రూపాయల ఆధీకృత మూలధనంతో కూడిన ఈ కంపెనీ..పెయిడ్ అప్ క్యాపిటల్ లక్ష రూపాయలుగా ఉంది. ఈ సంస్థ స్పోర్టింగ్, ఇతర రిక్రియేషనల్ కార్యకలాపాల్లో నిమగ్నం కానుంది. ఈ విషయం రిజిస్టార్ ఆఫ్ కంపెనీస్ (ఆర్ వోసీ) వెబ్ సైట్ చెబుతోంది. 2017 మార్చి15న ఈ కంపెనీని నెలకొల్పారు. రవిప్రకాష్, ఎన్టీవీ చౌదరి కలసి ఎంటర్ టైన్ మెంట్ ఛానల్ పెట్టాలనే యోచనలో ఉన్నట్లు ‘తెలుగు గేట్ వే.కామ్’ కొద్ది రోజుల క్రితమే వెల్లడించిన విషయం తెలిసిందే. సినిమా రంగాన్ని టార్గెట్ చేసుకుని..వీరు కొత్త ఛానల్ ప్రారంభించాలనే యోచనలో ఉన్నారు.
రాబోయే రోజుల్లో ఎంటర్ టైన్ మెంట్ రంగానికే ప్రాధాన్యత ఉంటుందనే ఉద్దేశంతో వీరు మందుకు కదులుతున్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. టీవీ9 యాజమాన్యం కూడా ఎప్పటి నుంచో ఆ సంస్థ నుంచి వైదొలటానికి ప్రయత్నాలు చేస్తోంది. పలు సంస్థలతో చర్చిస్తున్నా.. అవి ఓ కొలిక్కి రాకుండా అలా సాగుతూనే ఉన్నాయి. అయితే ఇప్పటికిప్పుడు కాకపోయినా టీవీ9లో ప్రధాన ప్రమోటర్ అయిన శ్రీని రాజు ఈ ప్రాజెక్టు నుంచి పూర్తి వైదొలటానికే సిద్ధంగా ఉన్నారు. అందుకే రవిప్రకాష్ ప్రత్యామ్నాయంగా ఈ ఎంటర్ టైన్ మెంట్ ఛానల్ పై దృష్టి పెట్టినట్లు చెబుతున్నారు. అయితే రవిప్రకాష్, ఎన్టీవీ చౌదరి కాంబినేషన్ లో వచ్చే కొత్త ప్రాజెక్టు ఎప్పుడు టేకాఫ్ అవుతుంది అన్నదానిపై క్లారిటీ రావాల్సి ఉంది.
నోట్. ఈ వార్తను తాజా సమాచారంతో అప్ డేట్ చేయటమైనది. గతంలో ప్రచురించిన వెర్షన్ లో కొంత సమాచారం లోపం ఉన్న దృష్ట్యా ఈ అప్ డేట్ చేశాం. ఒకే పేరుతో ఇద్దరు వ్యక్తులు ఉండటం వల్ల సమాచార లోపంతో జరిగిన పొరపాటుకు చింతిస్తున్నాం.