జగన్ పాదయాత్రపై ‘సర్కారు పంచాయతీ’
ఆంధ్రప్రదేశ్ లో పాదయాత్ర ‘పంచాయతీ’ మొదలైంది. నవంబర్ 6 నుంచి ఏపీ ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు అంతా రంగం సిద్ధం చేసుకోగా..సర్కారు మాత్రం ‘అనుమతుల’ పంచాయతీని తెరపైకి తెచ్చింది. అయితే వైసీపీ మాత్రం వైఎస్ రాజశేఖరరెడ్డి మొదలుకుని చంద్రబాబు వరకూ ఎవరూ ముందస్తు అనుమతి తీసుకోలేదని..అందుకే తాము కూడా తీసుకోవాల్సిన అవసరం లేదని వాదిస్తోంది. అయితే పాదయాత్ర వివరాలను ఇప్పటికే డీజీపీకి ఇచ్చేసినందున ఇక అనుమతి అన్న ప్రశ్న ఎందుకు అని వాదిస్తోంది. అయినా సరే ఏపీ పోలీసులు అనుమతి తీసుకోవాల్సిందే అని ఒత్తిడి తెస్తుండటంతో ఇది మరో వివాదంగా మారే సూచనలు కన్పిస్తున్నాయి. శుక్రవారం సాయంత్రం ఏపీ పోలీస్ శాఖ సీనియర్ అధికారి ఒకరు ఫోన్ చేసి, పాదయాత్రకు అనుమతి తీసుకున్నారా? అని ప్రశ్నించారని వైఎస్సార్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మీడియాకి తెలిపారు.
‘‘పాదయాత్రలకు సంబంధించి గతంలోనూ అనుమతుల ప్రస్తావన లేదని. ఇప్పుడు కూడా ఆ అంశం ఉత్పన్నం కాబోదన్నారు. పాదయాత్ర సమాచారాన్ని ఇదివరకే డీజీపీకి తెలియజేశాం’’ అని స్పష్టం చేశారు. ఎంపీ సుబ్బారెడ్డి వాదనతో సంతృప్తి చెందని పోలీసు అధికారి ఫోన్‌లో రెండోసారి కూడా ‘అనుమతులు తీసుకోవాలి కదా’ అని అనడంతో వైవీ సుబ్బారెడ్డి పాదయాత్రకు సంబంధించి మరింత సమాచారం ఇచ్చేందుకు రేపు(శనివారం) పార్టీ తరఫున ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, బొత్స సత్యనారాయణ, పార్థసారథిలు వచ్చి వివరాలు ఇస్తారు’’ అని సమాధానం ఇచ్చినట్లు తెలిపారు. నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే జగన్మోహన్ రెడ్డితోపాటు ఎవరినైనా పోలీసులు అదుపులోకి తీసుకోవచ్చు. కానీ ఏమీ లేకుండానే పోలీసులు కావాలని అనుమతుల పేరుతో రచ్చ చేయటం సరికాదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.