Telugu Gateway
Telugu

దినకరన్ ‘సెంటిమెంట్’ అస్త్రాలు

తమిళనాడు రాజకీయం ‘సెంటిమెంట్’ వైపు మళ్ళుతోంది. ఓ వైపు శశికళ, దినకరన్ వర్గాలను లక్ష్యంగా చేసుకుని ఐటి దాడులు చేస్తుండంతో..దినకరన్ ఈ వ్యవహారానికి కొత్త ‘ట్విస్ట్’ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ మార్గాన్ని ఎంచుకోవటం ద్వారా అటు ముఖ్యమంత్రి పళనిస్వామి, పన్నీర్ సెల్వంను ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. చూడాలి మరి ఈ సెంటిమెంట్ అస్త్రాలు ఏ మేరకు పనిచేస్తాయో. దివంగత ముఖ్యమంత్రి జయలలిత నివాసంలో ఐటీ సోదాలు చేయడం అమ‍్మను అవమానించడమే అని అన్నాడీఎంకే బహిష్కృత నేత, శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్‌ వ్యాఖ్యానించారు.. పోయెస్‌ గార్డెన్‌, వేద నిలయంలో ఐటీ దాడులు నిర్వహించడంపై ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈపీఎస్‌, ఓపీఎస్‌ కలిసే ఈ డ్రామా ఆడుతున్నారని దినకరన్‌ ఆరోపించారు.

డీఎంకే హయాంలో జయలలిత నివాసంలో సోదాలు జరిగాయని, అయితే ఇప్పుడు అన్నాడీఎంకే పాలనలోనే పోయెస్‌ గార్డెన్‌లో తనిఖీలు జరగడంతో జయలలిత ఆత్మ క్షోభిస్తుందన్నారు. తాజాగా శశికళ, దినకరన్, జయ టీవీ కార్యాలయంతో పాటు దేశంలోనే 187 ప్రాంతాలలో రికార్డు స్థాయిలో దాడులు జరిగిన విషయం విదితమే. అయితే ఇప్పటి వరకు జరిగిన దాడులపై గుంభనంగానే ఉన్నా జయలలిత నివాసంలో తనిఖీలపై తీవ్ర నిరసన ఎదురవుతోంది. ముందస్తుగానే న్యాయస్థానం అనుమతి తో జయటీవీ ఎండి వివేక్ నుండి తాళాలు తీసుకున్న అధికారులు జయ నివాసంలో సుమారు మూడు గంటలపాటు ఈ తనిఖీలు నిర్వహించారు. ఇక్కడి జయ అంతరంగిక గదితోపాటు ఆమె సహాయకుడైన పూకుండ్రన్ గది‌ని క్షుణ్ణంగా తనిఖీ చేసిన అధికారులు అక్కడి నుండి ఓ ల్యాప్ టాప్, నాలుగు పెన్ డ్రైవ్లు స్వాధీనం చేసుకున్నారు. ఇది తమిళనాడులో పెద్ద సంచలనంగా మారింది.

Next Story
Share it