Telugu Gateway
Telugu

జయ టీవీపై ఐటి దాడులు...టార్గెట్ శశికళ

తమిళనాడు రాజకీయాలు ఎప్పుడు ఏ మలుపు తిరుగుతాయో తెలియకుండా ఉంది. ప్రధాని నరేంద్రమోడీ తాజా చెన్నయ్ పర్యటన సందర్బంగా డీఎంకె అధ్యక్షుడు కరుణానిధిని పరామర్శించటంతో కొత్త రాజకీయం మొదలైంది. ఇది జరిగిన వెంటనే నోట్ల రద్దుకు వ్యతిరేకంగా డీఎంకె చేపట్టదలచిన ధర్నాలు విరమించుకున్నారు. అంటే డీఎంకె క్రమంగా బిజెపివైపు మొగ్గుచూపుతుందనే వార్తలు వచ్చాయి. ఎలాగైనా తమిళనాడులో పట్టు సాధించాలని బిజెపి కూడా లక్ష్యంగా పెట్టుకుని పావులు కదుపుతోంది. ఈ తరుణంలో టార్గెట్ శశికళగా..జయ టీవీతో పాటు శశికళ, దినకరన్ లకు ఐటి శాఖ షాక్ ఇచ్చింది. శశికళ, ఆమె బంధువుల ఆస్తుల లక్ష్యంగా ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. గురువారం తెల్లవారుజాము నుంచి 80మందికిపైగా ఐటీ అధికారులు ఏకంగా 30 చోట్ల తనిఖీలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. దివంగత ముఖ్యమంత్రి జయలలిత ప్రారంభించిన ’జయ టీవీ’, అన్నాడీఎంకేకు చెందిన నమధు ఎంజీఆర్‌ పత్రిక కార్యాలయాల్లోనూ ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. జయటీవీ కార్యాలయంలో దాదాపు పదిమంది ఐటీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు.జయలలిత ప్రారంభించినప్పటికీ ప్రస్తుతం జయటీవీ, నమధు ఎంజీఆర్‌ పత్రిక శశికళ కుటుంబసభ్యుల అధీనంలో ఉన్నాయి.

శశికళను పార్టీ నుంచి బహిష్కరించి.. ఈపీఎస్‌-ఓపీఎస్‌ శిబిరాలు విలీనమైన నేపథ్యంలో అన్నాడీఎంకే ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ ఈ సంస్థలు కథనాలు ప్రచురిస్తున్నాయి. పళనిస్వామి ప్రభుత్వానికి వ్యతిరేకంగా జయటీవీ, ఎంజీఆర్‌ పత్రిక పనిచేస్తున్న నేపథ్యంలోనే వీటిపై ఐటీ దాడులు జరగడం రాజకీయంగా సంచలనం రేపుతోంది. ముఖ్యంగా శశికళ బంధువులైన దినకరన్‌, దివాకరన్‌, ఇళవరసి, శశికళ మేనకోడలు కృష్ణప్రియ ఇంట్లో ఐటీ దాడులు ఏకకాలంలో కొనసాగుతున్నాయి. జయలలిత ఆస్తులు ప్రస్తుతం శశికళ కుటుంబసభ్యుల నియంత్రణలో ఉన్నాయి. వీటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నిస్తున్న నేపథ్యంలో శశికళ టార్గెట్‌గా ఐటీ దాడులు జరగడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఆదాయాన్ని దాచిపెట్టడం, పన్ను ఎగవేయడం వంటి సమాచారం ఆధారంగానే చానెల్‌ కార్యాలయంలో దాడులు నిర్వహించినట్టు ఐటీ అధికారులు చెబుతున్నారు.

Next Story
Share it