Telugu Gateway
Telangana

ఒకే రోజు..రెండు కీలక ఘట్టాలు

హైదరాబాద్ మోస్ట్ హ్యాపెనింగ్ సిటీగా మారింది. ఒకే రోజు..రెండు కీలక ఘట్టాలకు వేదిక కానుంది. ఈ రెండు ఘట్టాలు హైదరాబాద్ ను ప్రపంచ పటంలో నిలిపేవే. అయితే ఇందులో ఒకటి శాశ్వతంగా హైదరాబాద్ ప్రజలకు గుర్తుండి పోయేదికాగా...మరొకటి ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ పారిశ్రామిక సదస్సు. హైదరాబాద్ ప్రజలు ఎప్పటి నుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మెట్రో రైలు ప్రారంభోత్సవం మంగళవారం నాడే ప్రధాని నరేంద్రమోడీ చేతుల మీదుగా ప్రారంభం కానుంది. ఇందులో ముఖ్యమంత్రి కెసీఆర్ తోపాటు పలువురు పాల్గొననున్నారు. బుధవారం నుంచే నగర పౌరులకు మెట్రో సేవలు అందుబాటులోకి రానున్నాయి. మెట్రో రాకతో ఒక్కసారిగా హైదరాబాద్ ట్రాఫిక్ కష్టాలు కొంతైనా తీరొచ్చని అంచనా వేస్తున్నారు. తొలి దశలో 30 కిలోమీటర్ల మార్గంలోనే సర్వీసులు ప్రారంభం కానున్నాయి. మొత్తం ప్రాజెక్టు పూర్తి కావటానికి 2019 నాటికి కానీ పూర్తయ్యే అవకాశం కన్పించటం లేదు.

ఇదిలా ఉంటే గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూర్ సమ్మిట్ కోసం ఇఫ్పటికే దేశ, విదేశాలకు చెందిన ప్రతినిధులు హైదరాబాద్ చేరుకున్నారు. మొత్తం 150 దేశాలకు చెందిన పారిశ్రామికవేత్తల ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరుకానున్నారు. ఇందులో ప్రధాన ఆకర్షణ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్, భారత ప్రధాని నరేంద్రమోడీలే. వివిధ దేశాల నుంచి వచ్చేవారిలో ఎక్కువ మంది మహిళలే కావటం విశేషం. అందులోనూ యూత్ భాగమే ఎక్కువ. ఈ చారిత్రక సదస్సు ద్వారా హైదరాబాద్ కు ప్రపంచ పటంలో ప్రత్యేక గుర్తింపు దక్కించుకోనుంది. మంగళవారం సాయంత్రం ప్రధాని మోడీ, ఇవాంకాలు గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూర్ సమ్మిట్ ప్రారంభోత్సవం చేయనున్నారు. మోడీ మంగళవారం రాత్రి ఢిల్లీకి బయలుదేరతారు. ఇవాంకా మాత్రం బుధవారం వరకూ హైదరాబాద్ లో ఉండనున్నారు.

Next Story
Share it