నంది అవార్డులపై గుణశేఖర్ ఫైర్
ఆంధ్రప్రదేశ్ ప్రకటించిన నంది అవార్డులు దుమారం రేపుతున్నాయి. అర్హులకు కాకుండా..అవసరమైన వారికి అవార్డులు ఇచ్చినట్లు ఉందనే విమర్శలు విన్పిస్తున్నాయి. ఈ అవార్డుల ప్రకటనపై ప్రముఖ దర్శకుడు గుణశేఖర్..థర్డీ ఇయర్స్ పృథ్వీ తీవ్ర విమర్శలు చేశారు. లౌక్యం సినిమాలో తన నటనకు అవార్డు వస్తుందని ఆశించానని..కానీ నీకు ఇంకా అవార్డు అందుకునే స్థాయిలేదని ఈ ప్రకటన ద్వారా వాళ్లు తెలిపినట్లు అయిందని వ్యాఖ్యానించారు. అవార్డుల ప్రకటన తనకు అసంతృప్తి కలిగిందని..ఇది ఏ మాత్రం సరిగాలేదని కుండబద్దలు కొట్టారు. ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ కూడా తీవ్ర స్థాయిలో స్పందించారు. 'రుద్రమదేవి' చిత్రానికి ఏ ఒక్క కేటగిరీలోనూ అవార్డు దక్కకపోవడంపై ఆ చిత్ర దర్శకుడు గుణశేఖర్ మండిపడ్డారు.
ఈ విషయంపై స్పందిస్తూ తన ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్ట్ చేశారు. 'ప్రశ్నించడం తప్పా?...' అంటూ ఆయన చేసిన ట్వీట్‌లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి పలు ప్రశ్నలు వేశారు. చారిత్రాత్మక చిత్రం ''రుద్రమదేవి''కి వినోదపు పన్ను మినహాయింపు ఎందుకివ్వలేదు...? మరో చారిత్రాత్మక చిత్రం ''గౌతమిపుత్ర శాతకర్ణి''కి మినహాయింపు ఎందుకిచ్చారని గుణశేఖర్ ప్రశ్నించారు. మహిళా సాధికారతను చాటి చెబుతూ తీసిన ''రుద్రమదేవి'', మూడు ఉత్తమ చిత్రాల కేటగిరీలో ఏదో ఒక దానికి ఎంపిక కాలేకపోయిందని, కనీసం జ్యూరీ గుర్తింపునకు కూడా నోచుకోలేకపోయిందని ధ్వజమెత్తారు.