చేరిన వెంటనే టీడీపీకి గిడ్డి ఈశ్వరి ఝలక్
ఆమె అప్పుడే వైసీపీ నుంచి టీడీపీలోకి చేరారు. చేరిన కొద్దిసేపటికే అధికార తెలుగుదేశం పార్టీకి ఝలక్ ఇచ్చారు. పొరపాటుగా అలా మాట్లాడారో ..లేక వాస్తవం అదే అని అనుకున్నారో కానీ...గిడ్డి ఈశ్వరి వ్యాఖ్యలు మాత్రం టీడీపీ శ్రేణులను ఒకింత షాక్ కు గురిచేశాయనే చెప్పొచ్చు. టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో సోమవారం టీడీపీలో చేరిన తర్వాత ఆమె మీడియాతో మాట్లాడుతూ డ్యామ్‌షూర్ పాడేరు, అరకు నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీనే విజయం సాధిస్తుంది. ఈ వ్యాఖ్యలు విన్న టిడిపి నేతలు అవాక్కు అయ్యారు. అదే సమయంలో జగన్ అంటే తనకు ప్రాణమని, తనకు రాజకీయ భిక్ష పెట్టింది జగనే అని చెప్పుకున్నారు. వచ్చే ఎన్నికల్లో పాడేరు, అరుకు నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీనే గెలుస్తుందని ఆమె చెప్పారు.
గిడ్డి ఈశ్వరి మాట్లాడుతున్న సమయంలో విశాఖ జిల్లా రూరల్ టీడీపీ అధ్యక్షుడు పంచకర్ల రమేశ్‌బాబు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. బాక్సైట్ తవ్వకాలు చేస్తే సీఎం తలనరుకుతా అన్న వ్యాఖ్యల గురించి మీడియా ప్రశ్నించగా..తాను అప్పట్లో సీఎంను అనలేదని..ఇప్పటికీ ఎవరైనా బాక్సైట్ జోలికొస్తే అదే మాటకు కట్టుబడి ఉంటానని వ్యాఖ్యానించారు. ఆమె సీఎంపైనే విమర్శలు చేశారని అప్పట్లో టీడీపీ నేతలు గిడ్డి ఈశ్వరి పై కేసులు కూడా పెట్టారు. ఇప్పుడు ఏకంగా ఆమె టీడీపీలో చేరిపోయారు.