Telugu Gateway
Andhra Pradesh

జగన్ పై అది దుష్ప్రచారమే

డొల్ల కంపెనీలు..నగదు తరలింపు వ్యవహారానికి సంబంధించిన మీడియాలో వచ్చిన వార్తలపై వైసీపీ మండిపడింది. ఇదంతా ఓ పథకం ప్రకారం..పక్కాగా సాగుతున్న కుట్ర అని ఆరోపించింది. అసలు ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ జాబితా..అందులో జగన్ పేరు కూడా ఓ కుట్ర అని వైసీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ఆరోపించారు. ఈడీ దర్యాప్తు పేరుతో వైఎస్‌ జగన్‌పై ఎల్లో మీడియా అసత్య కథనాలు ప్రచారం చేస్తోందని ఆమె ఆరోపించారు. శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ... కొన్ని మీడియా సంస్థలు కథనాలు ప్రచురించాయని..వాటికి ఆధారాలు ఉన్నాయా అని ప్రశ్నించారు. ఇంగ్లీషు పత్రిక కథనాన్ని ఆధారంగా ఆ పత్రికలు ఎలా వార్తలు రాస్తాయని ప్రశ్నించారు. వైఎస్‌ జగన్‌కు వస్తున్న ప్రజాదరణ చూడలేకే చంద్రబాబు ఇలాంటి చవకబారు ఎత్తుగడలు వేస్తున్నారని ఆరోపించారు.

ప్రజల దృష్టిని మళ్లించడానికే టీడీపీ కుయుక్తులు పన్నుతోందని మండిపడ్డారు. అసత్య కథనాల ఆధారంగా చంద్రబాబు ప్రకటనలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్యారడైజ్‌ పత్రాల వ్యవహారంలో వైఎస్‌ జగన్‌ సవాల్‌కు టీడీపీ నాయకులు పారిపోయారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఎన్నికుట్రలు చేసినా జగన్‌కు ప్రజాదరణ తగ్గదని అన్నారు. వైఎస్‌ జగన్‌ ప్రజాసంకల్పయాత్రకు జనం నీరాజనాలు పడుతున్నారని తెలిపారు. జగన్‌ పాదయాత్రకు జనం వేలాదిగా వచ్చి సమస్యలు చెప్పకుంటున్నారని బహిరంగ సభల్లో చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారని చెప్పారు.

Next Story
Share it