Telugu Gateway
Telangana

కరో కరో జల్సా....తెలుగు కాంట్రాక్టర్ల లో కొత్త ట్రెండ్

ఒకప్పుడు కాంట్రాక్టర్లు పనుల కోసం ప్రభుత్వం చుట్టూ తిరిగేవారు. కానీ ఇఫ్పుడు సీన్ రివర్స్ అయింది. ప్రభుత్వాలే ‘మాకు ఆ కాంట్రాక్టరే’ కావాలి అని అడుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ ట్రెండ్ బాగా నడుస్తోంది. పైకి అంతా పద్దతి ప్రకారం నడిచినట్లే కన్పించినా..లోలోపల జరిగే గూడుపుఠానీలు చూస్తే ఎవరికైనా కళ్ళు తిరగాల్సిందే. గతంలో ఎన్నడూలేనంతగా ప్రభుత్వాలు..కాంట్రాక్టర్ల ‘సమ్మిళిత అభివృద్ధి’ ఈ మధ్య కాలంలో మరింత పెరిగిపోయింది. ప్రభుత్వాలను శాసించే కాంట్రాక్టర్లు పుట్టుకొచ్చారంటే పరిస్థితి ఎలా మారిపోయిందో ఊహించుకోవచ్చు. ఇదంతా ఒకెత్తు అయితే ప్రభుత్వాల నుంచి వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులు దక్కించుకుని వందల కోట్లలో లాభాలు గడిస్తున్న కాంట్రాక్టర్లు ‘కొత్త ట్రెండ్’కు శ్రీకారం చుట్టారు. తాజాగా ఎఎంఆర్ కన్ స్ట్రక్షన్స్ కు చెందిన మహేష్ రెడ్డి తన పుట్టిన రోజు కోసం ఏకంగా వంద మందిని విదేశీ పర్యటనకు తీసుకెళ్ళారు. కేవలం జంటలు మాత్రమే..యాభై కుటుంబాలను ప్రత్యేక విమానంలో తీసుకెళ్లారు. అంతే కాదు సుమా...వీరందరి కోసం ఓ ప్రత్యేక ‘క్రూయిజ్’ను బుక్ చేసి రోమ్ నుంచి పర్యటన ప్రారంభించారు.

మార్గమధ్యంలో పలు ప్రాంతాలు సందర్శిస్తూ ఎంజాయ్ చేశారు. ఇదంతా ఆయన పుట్టిన రోజు సందర్భంగా చేసిన హంగామానే సుమా. ఈ పర్యటనపై మహేష్ రెడ్డి కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు కాంట్రాక్టర్ల వర్గాల్లో పెద్ద హాట్ టాపిక్ గా మారింది. మహేష్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వంలో ఓ కీలక మంత్రికి సన్నిహితుడిగా కూడా పేరుంది. గతంలో ఎన్నడూలేని రీతిలో మెగా ఇంజనీరింగ్ డైరక్టర్ పిచ్చిరెడ్డి తన పుట్టిన రోజు కోసం సన్నీలియోన్ ను హైదరరాబాద్ పిలిపించి డ్యాన్స్ షో ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. మరో కాంట్రాక్టర్ తన పుట్టిన రోజుకు ఫ్రెండ్స్ ను తీసుకుని గోవా వెళ్లి ‘ప్రత్యేక ప్రాంతం’లో ఎంజాయ్ చేస్తారు. పనిలో పనిగా భార్య కోసం విదేశాల నుంచి ‘డైమండ్ నెక్లెస్’ తెప్పించారు. ప్రభుత్వాలు ఇఛ్చే వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులతో వీళ్ళ జల్సాలు ఇలా సాగుతున్నాయని ఓ అధికారి వ్యాఖ్యానించారు. మహేష్ రెడ్డి బర్త్ డే టూర్ కు ఓ ప్రముఖ ఛానల్ సీఈవో కూడా వెళ్లాల్సి ఉన్నా చివరి నిమిషంలో రద్దు అయినట్లు సమాచారం.

Next Story
Share it