గంటా శాఖలో ‘అవినీతి ఓ పర్మినెంట్ సబ్జెక్ట్’!
ఆంధ్రప్రదేశ్ మానవవనరుల శాఖలో ‘అవినీతి’ ఓ శాశ్వత సబ్జెక్ట్ గా మారిపోయింది. అవినీతికి.. ఆ శాఖకు అవినీతికి బంధం అంతగా బలపడిపోయింది. అది ఎలా అంటే ఏకంగా జీవోల ద్వారా వచ్చిన ఆదేశాలను మెమోలతో తూచ్ అన్పించేసి కోట్ల రూపాయలు దండుకుంటున్నారు. గత రెండు సంవత్సరాలుగా ఇది యధేచ్చగా సాగుతున్నా అవినీతిని ఏ మాత్రం సహించని చంద్రబాబు మాత్రం అసలు అటువైపు చూడటం లేదనే విమర్శలు ఆ శాఖ నుంచే వస్తున్నాయి. సహజంగా ప్రభుత్వంలో జీవోనే పక్కా ఆదేశం. కానీ అలాంటి జీవోలను తుంగలో తొక్కి మెమోల ద్వారా కోట్లు కొట్టేస్తున్నారు. ఈ విషయంలో సాక్ష్యాత్తూ మానవనరుల శాఖ మంత్రిగా ఉన్న గంటా శ్రీనివాసరావు కుటుంబ సభ్యులే తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
గత రెండు సంవత్సరాలుగా ఈ అక్రమాల దందా సాగుతోంది. సాక్ష్యాత్తూ బిజినెస్ రూల్స్ కు తిలోదకాలు ఇచ్చి కొంత మంది అధికారుల సహకారంతో ఈ దందా సాగిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో విద్యాప్రమాణాలు పెంచేందుకు వీలుగా సర్కారు కొన్ని నిర్ణయాలు తీసుకుంది. ఎలిమెంటరీ టీచర్ ట్రైనింగ్ ఇన్ స్టిట్యూట్స్/జిల్లా విద్యా శిక్షణా కేంద్రాలు (డైట్) ఎంట్రెన్స్ కు సంబంధించి కొన్ని ప్రమాణాలు పెట్టింది. డైట్ సెట్ ఎంట్రెన్స్ టెస్ట్ కు హాజరు కావాలంటే సదరు విద్యార్ధి ఇంటర్ లో కనీసం 50 శాతం మార్కులు పొంది ఉండాలి. ఈ పరీక్ష రాయాలంటే ఓసీ, బీసీ విద్యార్ధులకు 50 శాతం మార్కులు వచ్చి ఉ:డాలి. ఎస్సీ, ఎస్టీలకు 45 శాతం మార్కులు తప్పనిసరి చేశారు. దీంతో మార్కుల శాతం పెంచటంతో రాష్ట్రంలో ఉన్న డైట్ కాలేజీల్లో సీట్లు భారీగా మిగిలిపోతున్నాయి. అంతే అందరూ కలసి ‘సిండికేట్’గా మారి మంత్రిని కలిశారు. తాము ఇఛ్చిన ఉత్తర్వులను తామే తుంగలో తొక్కి ఓసీ, బీసీ విద్యార్ధులకు 35 మార్కులు వస్తే చాలని, ఎస్సీ, ఎస్టీలకు మాత్రం పూర్తిగా మినహాయింపు ఇచ్చేశారు.
దీంతో కాలేజీలకు సీట్లు నిండుతాయి..కాసుల పంట పడుతుంది. అందులో కొంత మొత్తాలను ప్రభుత్వంలోని పెద్దలకు కావాల్సిన వాళ్లకు చెల్లిస్తారు. ప్రమాణాలు పెంచటానికి అంటూ మార్కుల శాతాన్ని పెంచిన మానవవనరుల శాఖ రెండుసార్లు మెమోల ద్వారా డైట్ సెట్ కాలేజీలకు మినహాయింపులు ఇవ్వటం వెనక భారీ ఎత్తున అవినీతి జరిగిందని ఆ శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఇదొక్కటే కాదు అఫీలియేషన్ అనుమతుల వ్యవహారం కూడా విద్యాశాఖకు కాసుల వర్షం కురిపిస్తోంది. ఇక పోస్టింగ్ ల విషయానికి వస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే. ఒక్కో డీఈవో పోస్టుకు 25 నుంచి ఏభై లక్షల రూపాయలు సమర్పించుకోవాల్సిందే. ఆయా జిల్లాల్లో ఉన్న పరిస్థితులను బట్టి ఈ చెల్లింపులు చేస్తున్నారు. ఈ విషయాలన్నీ విద్యా శాఖలో బహిరంగ రహస్యంగానే మారిపోయాయి. కొంత మంది మంత్రులు సైతం ఈ డీఈవో పోస్టుల దందాలో జోక్యం చేసుకుంటున్నారు.