కాంగ్రెస్ ప్రాజెక్టుకు ‘కెటీఆర్ కొత్త కలర్’!
హైదరాబాద్ లో గేమింగ్ అండ్ యానిమేషన్ ప్రాజెక్టు ఇప్పుడు కొత్తగా తెరపైకి వచ్చిందేమీ కాదు. ఉమ్మడి రాష్ట్రంలోనే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వమే ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును ప్రకటించి..రాయదుర్గంలో దీనికి స్థలం కూడా కేటాయించింది. అప్పట్లో దీనికి గేమింగ్, యానిమేషన్, మీడియా అండ్ ఎంటర్ టైన్ మెంట్ సిటీ (గేమ్ సిటీ) అని పేరుపెట్టారు. అంతే కాదు ఈ ప్రాజెక్టుకు అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి శంకుస్థాపన కూడా చేశారు. 2014 జనవరిలో జరిగిన శంకుస్థాపన కార్యక్రమంలో అప్పటి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీష్ రావు, ఓదెలు, రాజయ్య, బిక్షపతి, జూపల్లి కృష్ణారావులు, అప్పటి టీడీపీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు తదితరులు ఈ ప్రాజెక్టును అడ్డుకునే ప్రయత్నం చేశారు. ప్రతిపాదిత స్థలాన్ని గేమ్ సిటీకి కేటాయించాన్ని వీరు అప్పట్లో తీవ్రంగా తప్పుపట్టి...విమర్శలు గుప్పించారు. ప్రైవేట్ సంస్థలకు విలువైన భూములు కట్టబెడుతున్నారని ధ్వజమెత్తారు. ఆ సమయంలో ఐటి శాఖ కార్యదర్శిగా సంజయ్ జాజు ఉండగా..ఏపీఐఐసీ ఎండీగా ప్రస్తుత ఐటి ముఖ్య కార్యదర్శి జయేష్ రంజనే ఉన్నారు. ఆ తర్వాత ఎన్నికలు రావటంతో ఈ ప్రాజెక్టు కాస్తా మరుగునపడిపోయింది.
మూడేళ్ల తర్వాత టీఆర్ఎస్ సర్కారు హైదరాబాద్ కు కొత్త ‘ఇమేజ్’ తెచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు చెబుతోంది. ఈ ప్రాజెక్టు ఏర్పాటును..యానిమేషన్ రంగం అభివృద్ధికి సర్కారు చేపట్టే చర్యలపై ఎవరూ అభ్యంతరం చెప్పరు. 935 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టే ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును సాలార్ పురియా సత్వా దక్కించుకుంది. కొత్తగా ఈ ప్రాజెక్టుకు టెండర్లు పిలిచి.. కొత్త డిజైన్లతో తెరపైకి తెచ్చింది. అయితే ఇదేదో తాము కొత్తగా తెచ్చినట్లు ప్రచారం చేసుకోవటంపై ఐటి శాఖ వర్గాలు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. అయితే అప్పుడు అనుకున్న ప్లేస్ కు..ఇప్పుడు కొత్తగా నిర్మించే ప్రాంతంలో మార్పు ఉంది. భవనం డిజైన్..ప్రాజెక్టు వ్యయంలో కూడా భారీ మార్పులు వచ్చాయి.