Telugu Gateway
Andhra Pradesh

‘చంద్రబాబు’ అనుకున్నదే చేశారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన ‘ఇష్ట ప్రకారమే’ ముందుకు సాగుతున్నారు. సాక్ష్యాత్తూ కేంద్ర ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నా..ఆయన మాత్రం తాను అనుకున్న విధంగానే ముందుకు సాగుతున్నారు. ఈ లెక్కన రాష్ట్ర ప్రభుత్వంపై దాదాపు 1400 కోట్ల రూపాయల మేర అదనపు భారం పడనుంది. కాంట్రాక్టర్ ను మారిస్తే పెరిగే వ్యయాన్ని తాము భరించే ప్రశ్నేలేదని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తేల్చి చెప్పారు. అయినా సరే చంద్రబాబు ముందుకే వెళ్లటానికి నిర్ణయించుకన్నట్లు తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే మరి ఈ వ్యవహారంపై కేంద్రం ఎలా స్పందిస్తుందో వేచిచూడాల్సిందే. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన పోలవరం విషయంలో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కేంద్ర ప్రభుత్వమే తీసుకోవాల్సి ఉంటుంది. ప్రాజెక్టు అమలు బాధ్యత మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. కానీ సంబంధం లేని అంశంపై ఏపీ కేబినెట్ లో చర్చించి..సొంతంగా నిర్ణయం తీసుకుని ముందుకు సాగుతున్న తీరు సాగునీటి శాఖ వర్గాల్లో కలకలం రేపుతోంది.

ఈ వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందా? అన్న టెన్షన్ అధికార వర్గాల్లో ఉంది. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి స్పిల్ వే బ్లాక్ 0 నుంచి 35 వరకూ, కాంక్రీట్ పనిలో మిగిలిన పనులు అప్రాన్, స్పిల్ వే, వంతెన, స్పిల్ ఛానల్ ఛైనేజ్ 356 మీటర్ల నుంచి చైనేజ్ 1540 మీటర్ల వరకూ సిమెంట్ కాంట్రీట్ బ్లాకులు/లైనింగ్ కాంక్రీట్, స్పిల్ ఛానల్ చైనేజ్ వంటి పనుల కోసం తాజాగా టెండర్ నోటిఫికేషన్ జారీ చేశారు. డిసెంబర్ 4 లోపు ఆసక్తిగల సంస్థలు టెండర్లు దాఖలు చేయాలని టెండర్ నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. కేంద్రం ఈ మార్పుకు అంగీకరించకపోతే మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. దీనిపై ట్రాన్స్ స్ట్రాయ్ రియాక్షన్ ఎలా ఉంటుందో కూడా వేచిచూడాల్సిందే. 60 సీ కింద నోటీసు జారీ చేస్తే ప్రాజెక్టు మొత్తానికి ఉండాలి కానీ..అలా విడివిడిగా ఎలా ఉంటుందని అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు.

Next Story
Share it