సీఆర్ డీఏతో ‘చంద్రబాబు మూడు ముక్కలాట’!
ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఏపీసీఆర్ డీఏ)..ఏపీలో కొత్త రాజధాని అభివృద్ధికి ఏర్పాటైన అథారిటీ. కానీ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సీఆర్ డీఏతో ‘మూడు ముక్కలాట’ ఆడుతున్నారు. అది ఎలా అంటారా?. తెలుసుకోవాలంటే ముందుకు సాగండి మరి. ఫస్ట్ స్విస్ ఛాలెంజ్. తర్వాత పోటీ బిడ్డింగ్. ఇప్పుడు హైబ్రిడ్ యాన్యుటీ. సీఆర్ డీఏ పరిధిలో వేల కోట్ల రూపాయల పనులు అప్పగించేందుకు నిత్యం మారుతున్న ‘టెండర్’ విదానాలు. ఒక సంస్థ లో ఇన్ని టెండర్ మోడల్స్ ఉంటాయా?. అసలు ఇది ఆమోదయోగ్యమేనా?. ఆమోదయోగ్యం ఎవరికి కావాలి?. ఆ మోడల్స్ అన్నీ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి, ఆయన అస్మదీయులకు అనుకూలంగా ఉంటే చాలు. అందరికీ ఆమోదయోగ్యం అయినట్లే లెక్క. ఇప్పుడు సీఆర్ డీఏలో అచ్చంగా అదే సాగుతోంది. కొత్తగా ‘హైబ్రిడ్ యాన్యుటీ’ మోడల్ ను తెరపైకి తెచ్చి అస్మదీయ కంపెనీలు అయిన బీఎస్ఆర్, మెగా ఇంజనీరింగ్ లకు వందల కోట్ల రూపాయల పనులు కట్టబెట్టారు. అసలు టెండర్ల దశ కూడా ఖరారుకాకముందే బీఎస్ఆర్ కు రెండు వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులు దక్కుతాయని టీడీపీ వర్గాల్లో ప్రచారం జరిగింది..ఇదే విషయాన్ని మొదట తెలుగు గేట్ వే నే వెలుగులోకి తెచ్చింది. వాళ్ళు చెప్పినట్లే ఇప్పటికే తొలి దశలో ఓ 725 కోట్ల రూపాయల పనులు దక్కాయి.
అసలు యాన్యుటీ విధానమే సర్కారుపై తీవ్ర ఆర్థిక భారం మోపేది. కాంట్రాక్టర్లకు మేలుచేసేది. వైఎస్ సీఎంగా ఉన్న సమయంలో కడప జిల్లా పులివెందులలో యాన్యుటీ కింద పులివెందల రోడ్లు అప్పగింతకు ప్రయత్నించగా..ప్రస్తుతం ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న అప్పటి ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా దినేష్ కుమార్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ రోడ్లకు బడ్జెట్ లో తాను నిధులు కేటాయిస్తానని, యాన్యుటీ వద్దని కోరారు. అయినా ఒప్పుకోని వైఎస్ఆర్ యాన్యుటీ కిందే తనకు కావాల్సిన కాంట్రాక్టర్ కు పనులు అప్పగించారు. యాన్యుటీ కింద పనులు చేపడితే వంద కోట్ల రూపాయలతో అయ్యే ప్రాజెక్టు వ్యయం మూడు వందల కోట్ల రూపాయలు అవుతుంది. అంతలా భారం పడుతుంది మరి ఈ విధానంలో. కానీ ఇప్పుడు సీఆ ర్ డీఏ టెండర్ టెండర్ కో విధానం మార్చుకుంటోంది. ఇది అంతా ముఖ్యమంత్రి చంద్రబాబు డైరక్షన్ ప్రకారం సాగుతున్న తంతే.
ఈ మధ్య ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఐఏఎస్ లు, స్టాఫ్ క్వార్టర్లకు సంబంధించి మాత్రం ‘పోటీ బిడ్డింగ్ ’లో టెండర్లు పిలిచారు. ఇందులోనూ అడ్డగోలుగా అంచనాలు పెంచినా టెండర్లు అయితే పిలిచారు. అన్నింటి కంటే ముఖ్యంగా చంద్రబాబు తనకు కావాల్సిన సింగపూర్ సంస్థలకే ‘స్విస్ ఛాలెంజ్’ మోడల్ లో రాజధానిలో ‘స్టార్టప్ ఏరియా’ పేరుతో 1691 ఎకరాలు కేటాయించారు. అంతేకాదు సుమా దాదాపు ఐదు వేల కోట్లతో సర్కారే మౌలికసదుపాయాలు కల్పించి వారి వ్యాపారానికి సహకరిస్తుందన్న మాట. దీని కోసం ఏకంగా చట్టాన్ని కూడా మార్చేసింది సర్కారు. అసలు దేశంలోనే స్విస్ ఛాలెంజ్ అత్యుత్తమ మోడల్ అని ప్రకటించారు. మరి అంత ఉత్తమ స్విస్ ఛాలెంజ్ మోడల్ ఉండగా..పోటీ టెండర్లు ఎందుకు పిలిచారు?. ఇప్పుడు కొత్తగా ‘హైబ్రిడ్ యాన్యుటీ’ మోడల్ ఎందుకొచ్చిందో. ఏ మోడల్ అయినా సరే అది చంద్రబాబు కోసమే!.