Telugu Gateway
Andhra Pradesh

హోదా కోసం వైసీపీ ఎంపీల రాజీనామాలు ఏమయ్యాయి?

ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం ముందుకు రాకపోతే తమ ఎంపీలు రాజీనామా చేస్తారన్న ప్రతిపక్ష జగన్మోహన్ రెడ్డి మాట ఏమైందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. తాము కేంద్రంలో అధికార భాగస్వామిగా ఉన్నందున గట్టిగా మాట్లాడలేకపోవచ్చని..ప్రతిపక్షం రాష్ట్రం కోసం గట్టిగా ఫైట్ చేయవచ్చుగా? అని అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు ప్రశ్నించారు. ప్రతిపక్షాలు రాష్ట్రంలో సభలు, సమావేశాలు పెట్టి ఎవరు అన్యాయం చేశారో చెప్పొచ్చు అని..తాము కూడా దానికి వివరణ ఇస్తామని అన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వకపోతే రాజీనామాలు చేస్తామన్న వారు ఇప్పుడు ఏమీ మాట్లాడటం లేదని..అంటే కేవలం రాజకీయాల కోసమే వైసీపీ ఇదంతా చేసిందనే విషయం అర్థం అవుతుందని వ్యాఖ్యానించారు. పోలవరం అంశంపై ప్రకటన చేస్తూ చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. తాజాగా పిలిచిన పోలవరం టెండర్ ను నిలుపుదల చేయాలంటే కేంద్రం లేఖ రాసిన అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అసెంబ్లీ సాక్షిగా ఓ ప్రకటన చేశారు. ఈ లేఖపై తాను కేంద్ర మంత్రి గడ్కరీతో మాట్లాడే ప్రయత్నం చేశానని..ఆయన లండన్ లో ఉన్నందున తిరిగి వచ్చాక మాట్లాడదామని అన్నారని తెలిపారు. పోలవరం కోసం ఇంకా 60 వేల ఎకరాల భూ సేకరణ చేయాల్సి ఉందని చెప్పారు.

అదే సమయంలో 98 వేల గిరిజన కుటుంబాలకు ఎలాంటి నష్టం లేకుండా చూడాల్సిన బాధ్యత ఉందని తెలిపారు. భూ సేకరణ అంచనా వ్యయం 32 వేల కోట్లకు పెరిగిందని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై ఇప్పటికే 12 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయగా..ఇంకా ఈ పనులు పూర్తి చేసేందుకు 42 వేల కోట్ల రూపాయలు అవసరం అవుతాయని తెలిపారు. సకాలంలో పోలవరం పూర్తి కావాలన్నదే తన ధ్యేయమని..ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నామని సభకు వివరించారు. ప్రత్యేక హోదాపై తాను ఏమీ త్యాగం చేయలేదని..విజ్ణత ప్రదర్శించినట్లు తెలిపారు. ప్రత్యేక హోదాలో ఉన్నవన్నీ ప్యాకేజీ ద్వారా ఇస్తామని ఆర్థిక మంత్రి చెపితే అంగీకరించినట్లు వెల్లడించారు. విభజన చట్టంలోని హామీలు..కేంద్ర సహకారం గురించి కేంద్రంతో మాట్లాడుతున్నామని తెలిపారు.

Next Story
Share it