బిత్తిరి సత్తిపై దాడి..మణికంఠ అరెస్టు
సంచలనం సృష్టించిన బిత్తిరి సత్తిపై దాడి కేసుకు సంబంధించిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. సత్తిపై దాడి చేసింది సికింద్రాబాద్ కళాసిగూడకు చెందిన మణికంఠ(26) గా గుర్తించారు. దాడి ఘటనతో గాయాలపాలైన బిత్తిరి సత్తిని స్టార్ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సత్తికి చికిత్స నిర్వహిస్తున్నట్లు ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి. సమాచారం అందుకున్న బంజారాహిల్స్ పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి దాడికి పాల్పడిన మణికంఠను అదుపులోకి తీసుకున్నారు. గత కొద్ది రోజుల నుంచి బిత్తిరి సత్తిపై దాడి చేసేందుకు రెక్కి నిర్వహించానని ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు వీ6 చానెల్ వద్దకు వచ్చి బిత్తిరి సత్తి కోసం వేచి చూశానని నిందితుడు తెలిపాడు.
సరిగ్గా 12.30 గంటలకు సత్తి అప్పుడే లోపలికి వస్తుండగా హెల్మెట్‌తో దాడి చేసినట్లు ఒప్పుకున్నాడు. ఎందుకు దాడి చేశావని ప్రశ్నించగా తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఆ చానెల్‌లో బిత్తిరి సత్తి తెలంగాణ భాషను కించపరుస్తూ, వెక్కిరిస్తూ మాట్లాడటం భరించలేకపోయానన్నారు. తాను సినిమా దర్శకుడిగా, రచయితగా ఉన్నానని తాను చదివిన పుస్తకాల్లో బిత్తిరి సత్తి మాట్లాడుతున్న యాస ఎక్కడా కనిపించలేదన్నారు. పని గట్టుకొని తెలంగాణను బదనాం చేయడానికి సత్తి కంకణం కట్టుకున్నాడని ఆరోపించారు. ఇలాంటి భాషను ఇంకోసారి ఉపయోగించి తెలంగాణ భాష గౌరవాన్ని దెబ్బతీయవద్దని దాడికి పాల్పడ్డట్లు తెలిపాడు. మణికంఠపై కేసు నమోదు అయింది. అయితే దాడికి ఏమైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.