అమరావతి నిర్మాణానికి ‘గ్రీన్’ సిగ్నల్
ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని నిర్మాణానికి ‘గ్రీన్ సిగ్నల్’ లభించింది. ఈ నిర్మాణం వల్ల పర్యావరణానికి హాని కలుగుతుందంటూ దాఖలైన పిటీషన్లకు సంబంధించి జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ప్రిన్సిపల్ బెంచ్ శుక్రవారం తుది తీర్పు వెలువరించింది. అందులో రాజధాని నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పర్యావరణం దెబ్బతినకుండా, నిబంధనలకు లోబడే రాజధాని నిర్మాణాలు చేపట్టాలని సూచించింది. ఇందుకు సంబంధించి రెండు కమిటీలను ఏర్పాటు చేయాలని ఎన్జీటీ ఆదేశించింది. నిర్మాణ పనులపై నెలనెలా సమీక్షించాలని పేర్కొంది. పర్యావరణ పరిరక్షణకు సూపర్వైజర్, ఇంప్లిమేషన్ కమిటీలు ఏర్పాటు చేయాలని ఎన్జీటీ చైర్పర్సన్ జస్టిస్ స్వతంతర్ కుమార్, సభ్యులు జస్టిస్ రఘువేంద్ర రాథోర్, జస్టిస్ బిక్రమ్‌సింగ్ సజ్వాన్‌లతో కూడిన ధర్మాసనం తీర్పునిచ్చింది.
కొండవీటి వాగు దిశను మార్చరాదని, కరకట్టలను ముందుకు జరపవద్దని ఎన్జీటీ తన తీర్పులో పేర్కొంది. పర్యావరణ శాఖ నిబంధనలు పకడ్బందీగా అమలు చేయాలని ఎన్జీటీ పేర్కొంది. రాజధాని నిర్మాణం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చట్ట ఉల్లంఘనకు పాల్పడుతుండటంపై పి.శ్రీమన్నారాయణ, మాజీ ఐఏఎస్ అధికారి ఈఎఎస్ శర్మ, బొలిశెట్టి సత్యనారాయణ తదితరులు 2015లో ఎన్జీటీని ఆశ్రయించారు. వీరు దాఖలు చేసిన పిటిషన్లపై ఇటీవలే వాదనలు ముగించిన ఎన్జీటీ తీర్పును వాయిదా వేసి..శుక్రవారం నాడు తుది తీర్పును వెలువరించింది.