Telugu Gateway
Top Stories

స‌మీర్ వాంఖడేను వెంటాడుతున్న వివాదాలు

స‌మీర్ వాంఖడేను వెంటాడుతున్న వివాదాలు
X

నిత్యం ఏదో ఒక వివాదం. ప్ర‌స్తుతం జాతీయ స్థాయిలో ఈ పేరు మారుమోగుతోంది. ముంబ‌య్ క్రూయిజ్ నౌక‌లో డ్ర‌గ్స్ పార్టీ న‌డుస్తుంద‌నే ఆరోప‌ణ‌ల‌తో బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ త‌న‌యుడు ఆర్య‌న్ ఖాన్ తోపాటు మ‌రికొంత మందిని అరెస్ట్ చేసిన విష‌యం తెలిసిందే. అయితే తాజాగా ఆర్య‌న్ ఖాన్ విడుద‌ల‌కు 25 కోట్ల రూపాయ‌లు డిమాండ్ చేశార‌నే ఆరోప‌ణ‌లు వెల్లువెత్తాయి. దీనిపై విచార‌ణ‌కు సైతం ఆదేశించారు. ఇది ఇలా ఉండ‌గా..ఇప్పుడు మ‌రో వివాదంలో చిక్కుకున్నారు వాంఖ‌డే. అది ఏంటి అంటే బాలీవుడ్ సెల‌బ్రిటీల ఫోన్లు ట్యాప్ చేసి, వారి నుంచి డ‌బ్బులు వ‌సూలు చేసిన‌ట్లు మ‌హారాష్ట్ర మంత్రి న‌వాబ్ మాలిక్ ఓ లేఖ‌ను విడుద‌ల చేశారు. అంతే కాదు..ఆయ‌న త‌మ ఫోన్ల‌ను కూడా ట్యాప్ చేస్తున్నార‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. 26 కేసుల ద‌ర్యాప్తు స‌మ‌యంలో వాంఖ‌డే నిబంధ‌న‌ల‌కు వ్య‌తిరేకంగా వ్య‌వ‌హ‌రించార‌ని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ ఆరోప‌ణ‌ల‌కు సంబంధించి త‌న‌కు వ‌చ్చిన లేఖ‌ను సీఎం, డీజీకి పంపిస్తున్న‌ట్లు తెలిపారు. దీనిపై కూడా విచార‌ణ జ‌ర‌గాల‌న్నారు. ఈ లేఖ వ్య‌వహారంపై వాంఖ‌డే స్పందించారు. ఇది పెద్ద జోక్ అంటూ..అందులో ఎలాంటి వాస్త‌వాలు లేవ‌న్నారు. అయితే త‌న‌పై న‌వాబ్ మాలిక్ ఎన్ని ఆరోప‌ణ‌లు అయినా చేసుకోవ‌చ్చ‌ని వ్యాఖ్యానించారు. వ‌ర‌స పెట్టి వివాదాలు వెంటాడుతుండ‌టంతో మాదకద్రవ్యాల నియంత్రణ విభాగం(ఎన్‌సీబీ) ముంబ‌య్ జోనల్‌ డైరెక్టర్ గా ఉన్న సమీర్‌ వాంఖడే పీకల్లోతు చిక్కుల్లో ప‌డ్డారు. ఆర్యన్‌ బెయిల్‌ కోసం ఎన్‌సీబీ అధికారులు రూ. 25 కోట్ల లంచం డిమాండ్‌ చేశారంటూ ఈ కేసులో స్వచ్ఛంద సాక్షిగా ఉన్న ప్రభాకర్‌ సెయిల్‌ ఆదివారం వెల్లడించడంతో.. ఈ కేసు ఒక్కసారిగా మలుపుతిరిగింది.సెయిల్‌ తన వద్ద ఆధారాలున్నాయంటూ కోర్టులో అఫిడవిట్‌ వేశారు. లంచంలో రూ. 8 కోట్లు సమీర్‌ వాంఖడే వాటా అని ఆయన పేర్కొనడంతో.. జోనల్‌ డైరెక్టర్‌ ఇప్పుడు స‌మ‌స్య‌ల్లో ప‌డిన‌ట్లు అయింది.

బెదిరింపులు, లంచం ఆరోపణల్లో తనను అరెస్టు చేసే అవకాశం, ఉద్యోగం నుంచి సస్పెండ్‌ చేసే ప్రమాదం ఉండడంతో ఆయన సోమవారం ముంబై పోలీసు కమిషనర్‌ను కలిసి ఓ లేఖ అందజేశారు. మంగళవారం ఎన్‌సీబీ కేసుల ప్రత్యేక న్యాయమూర్తి వీవీ పాటిల్‌కు ఓ అఫిడవిట్‌ను సమర్పించారు. ''నన్ను ఓ రాజకీయ నేత (నవాబ్‌ మాలిక్‌) టార్గెట్‌గా చేసుకున్నారు. నన్ను, నా కుటుంబాన్ని, చనిపోయిన నా తల్లిని లక్ష్యంగా చేసుకుని, అసత్యాలను ప్రచారం చేస్తున్నారు. నా పరువుకు భంగం కలిగిస్తున్నారు. సెయిల్‌ అందజేసిన అఫిడవిట్‌కు సంబంధించి నాపై విచారణలు లేకుండా ఆదేశాలు జారీచేయాలని ప్రార్థిస్తున్నాను'' అని అందులో పేర్కొన్నారు. ఎన్‌సీబీ కూడా వేరుగా అఫిడవిట్‌ దాఖలు చేసింది. ''సమీర్‌ వాంఖడే సర్వీస్‌ రికార్డంతా నిష్కళంకంగా ఉంది. ఆయన నిజాయితీపరుడు. మాకు వ్యతిరేకంగా మారిన సాక్షి సెయిల్‌ చేసిన ఆరోపణలపై ఎన్‌సీబీ డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ విచారణ ప్రారంభించారు. ఈ కేసులో వాంఖడేపై తదుపరి చర్యలు లేకుండా ఆదేశాలివ్వగలరు'' అని కోరింది. ఈ రెండు అఫిడవిట్లను పరిశీలించిన న్యాయమూర్తి.. ఆ మేరకు ఆదేశాలు ఇవ్వజాలమంటూ వాంఖడే, ఎన్‌సీబీ అభ్యర్థనలను నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారు. ఆర్యన్‌ఖాన్‌ బెయిల్‌ కోసం బాంబే హైకోర్టుకు వెళ్లారని, ఈ నేపథ్యంలో తాము కల్పించుకోలేమ‌ని స్పష్టం చేశారు. దీంతో స‌మీర్ వాంఖడే హుటాహుటిన ఢిల్లీ వెళ్లారు.

Next Story
Share it