Telugu Gateway
Top Stories

కాంగ్రెస్ అన్యాయం స‌రే..మోడీ చేసిన న్యాయం ఏంటి?!

కాంగ్రెస్ అన్యాయం స‌రే..మోడీ చేసిన న్యాయం ఏంటి?!
X

పార్ల‌మెంట్ లో రాష్ట్ర‌ప‌తి ప్ర‌సంగానికి ధ‌న్య‌వాదాలు తెలిపే తీర్మానంపై జ‌రిగిన చ‌ర్చ‌లో ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ ఎక్కువ సమ‌యం తాము చేసిన ప‌నుల కంటే కాంగ్రెస్ పై విమ‌ర్శ‌ల‌కే కేటాయించారు. చివ‌ర‌కు దేశంలో కోవిడ్ పెర‌గ‌టానికి కూడా కాంగ్రెస్ పార్టీనే అంటూ విచిత్ర వ్యాఖ్య‌లు చేశారు. వ‌ల‌స కార్మికుల విష‌యంలో మోడీ స‌ర్కారు వ్య‌వ‌హ‌రించిన తీరుపై దేశ వ్యాప్తంగా తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు రాగా...ఇప్పుడు అందుకు కార‌ణం కాంగ్రెస్ పార్టీయే అంటూ ఆయ‌న నిందించారు. దేశంలో కోవిడ్ ప్ర‌వేశించిన తొలి ద‌శ‌లో మోడీ స‌ర్కారు తీసుకున్న నిర్ణ‌యాలు పెద్ద ఎత్తున విమ‌ర్శ‌ల‌కు గుర‌య్యాయి. ఏ మాత్రం క‌స‌ర‌త్తు చేయ‌కుండా...ప్ర‌జ‌ల‌కు సరిప‌డినంత స‌మ‌యం ఇవ్వ‌కుండా ఆక‌స్మిక లాక్ డౌన్ పెట్టి దేశంలోని అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌ను..ముఖ్యంగా వ‌ల‌స కార్మికుల‌ను నానా క‌ష్టాలు పాలు చేసిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు అందుకు ఆయ‌న కాంగ్రెస్ ను నిందించిన తీరు చూసి ప్ర‌జ‌లు కూడా అవాక్కు అవుతున్నారు.

త‌న ప్ర‌సంగంలో తొలి రోజు కోవిడ్ పై కాంగ్రెస్ ను టార్గెట్ చేసిన మోడీ..రెండ‌వ రోజు అంటే మంగ‌ళ‌వారం నాడు ఏపీ విభ‌జ‌న అంశాన్ని తీసుకుని కాంగ్రెస్ పార్టీపై విమ‌ర్శ‌లు గుప్పించారు. 2014 ఎన్నిక‌ల స‌మ‌యంలో ఏమి చెప్పారో..ఇప్పుడు పార్ల‌మెంట్ లో అవే అంశాల‌ను ప్ర‌స్తావించారు. స‌రే కాసేపు మోడీ వాద‌నే నిజం అనుకుందాం. మ‌రి కాంగ్రెస్ చేసిన అన్యాయాన్ని ఈ ఏడేళ్ళ‌లో మోడీ స‌వ‌రించింది ఎక్క‌డ‌?. విభ‌జ‌న వ‌ల్ల ఎక్కువ‌గా న‌ష్ట‌పోయిన ఏపీకి కానీ..విభ‌జ‌న చ‌ట్టం ప్ర‌కారం తెలంగాణ‌కు ఇవ్వాల్సిన ప్రాజెక్టులు..రాయితీలు..ప్రోత్సాహ‌కాల విష‌యంలో మోడీ స‌ర్కారు చేసింది ఏమి ఉంది?. అంతే కాదు..విభ‌జ‌న‌కు సంబంధించి ఇప్ప‌టివ‌ర‌కూ ఇంకా ప‌రిష్కారం కానీ కీల‌క అంశాల విష‌యంలోనూ మీరు మీరు చూసుకోండి మాకేమి సంబంధం అన్న‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తోంది. అంతే కాదు..విభ‌జ‌న‌తో న‌ష్ట‌పోయిన ఏపీకి ఇచ్చిన అత్యంత కీల‌క‌మైన ప్ర‌త్యేక హోదాను అట‌కెక్కించింది కూడా మోడీ స‌ర్కారే. అస‌లు ఇప్పుడు పార్ల‌మెంట్ వేదిక‌గా మోడీ ఈ విభ‌జ‌న‌ అంశాల‌ను మోడీ ఎందుకు ప్ర‌స్తావించాల్సి వ‌చ్చింది అన్న‌ది కూడా చర్చ‌నీయాంశంగా మారింది.

పార్లమెంట్ లో మోడీ వ్యాఖ్య‌లు

ఆంధ్ర ప్రదేశ్ విభజన వల్ల ఏర్పాటైన రెండు రాష్ట్రాలు ఇప్పటికీ కష్టాల్లోనే ఉన్నాయనినరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ ఉనికిలో ఉండటం వల్ల ప్రజాస్వామ్య మూలాలు దెబ్బతింటున్నాయన్నారు. ఆంధ్ర ప్రదేశ్‌కు కాంగ్రెస్ అన్యాయం చేసిందన్నారు. ఆంధ్ర ప్రదేశ్‌ను కాంగ్రెస్ హడావిడిగా విభజించిందన్నారు. తాము తెలంగాణాకు వ్యతిరేకం కాదన్నారు. విభజన జరిగిన తీరు ఎలా ఉందనేది చాలా ముఖ్యమైన విషయమని వ్యాఖ్యానించారు. తెలంగాణాను ప్రత్యేక రాష్ట్రంగా విభజించినప్పటికీ, ఆ పార్టీని ప్రజలు నమ్మలేదన్నారు. బీజేపీ అగ్ర నేత అటల్ బిహారీ వాజ్‌పాయి ప్రధాన మంత్రిగా ఉన్న కాలంలో ఎటువంటి వివాదాలకు తావు లేని రీతిలో, శాంతియుతంగా మూడు రాష్ట్రాలను ఇచ్చామని చెప్పారు.

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌కు కాంగ్రెస్ చాలా అన్యాయం చేసిందన్నారు. విభజన తర్వాత రెండు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ ఓడిపోయిందన్నారు. సరైన విధంగా విభజన జరిగి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదన్నారు. విభజన చట్టంపై ఎలాంటి చర్చలు జరగలేదని చెప్పారు. పార్లమెంట్ లో కాంగ్రెస్ సభ్యులు పెప్పర్ స్ప్రే వాడారన్నారు. పార్లమెంటులో తలుపులు వేసి, మైక్‌లు కట్ చేసి, బిల్లును ఆమోదించారన్నారు. ఇదేనా ప్రజాస్వామ్యం? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ అహంకారం, అధికార కాంక్షకు ఇది నిదర్శనమని వ్యాఖ్యానించారు. విభజన తీరుతో ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలు ఇప్పటికీ నష్టపోతున్నాయన్నాయ‌ని పేర్కొన్నారు.

Next Story
Share it