Telugu Gateway
Top Stories

అమెరికాకు అవ‌మానం..జో బైడెన్ కు 14 వ‌ర‌సలో సీటు!

అమెరికాకు అవ‌మానం..జో బైడెన్ కు 14 వ‌ర‌సలో సీటు!
X

అగ్ర‌రాజ్యం అమెరికా అంటే ఎక్క‌డైనా పెద్ద పీట వేస్తారు. కానీ అమెరికాకు అవ‌మానం జ‌రిగింది అంటున్నారు మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. ఇదే అద‌నుగా ప్రెసిడెంట్ జో బైడెన్ పై విమ‌ర్శ‌లు ఎక్కుపెట్టారు ఆయ‌న‌. దీనికి కార‌ణం బ్రిట‌న్ రాణి ఎలిజ‌బెత్ 2 అంత్య‌క్రియ‌ల సంద‌ర్భంగా జ‌రిగిన కార్య‌క్రమంలో జో బైడెన్ ఫ్యామిలీకి సీటు ఎక్క‌డో వెన‌క కేటాయించ‌టంపై ట్రంప్ వ్యంగాస్త్రాలు సంధించారు. ఈ కార్య‌క్ర‌మానికి అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ తోపాటు ప‌లు దేశాల‌కు చెందిన ప్ర‌తినిధులు హాజ‌ర‌య్యారు. లండ‌న్ లోని వెస్ట్ మినిస్ట‌ర్ అబేలో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్. ఆయ‌న భార్య‌కు 14 వ‌ర‌స‌లో సీటు కేటాయించారు.

దీనికి సంబంధించిన ఫోటోల‌ను త‌న సొంత సోష‌ల్ మీడియా ఫ్లాట్ ఫాం ట్రూత్ లో పోస్ట్ చేస్తూ విమ‌ర్శ‌లు గుప్పించారు. రెండేళ్ల‌లో అమెరికా ప‌రిస్థితి ఎంత దారుణంగా మారిందో చూడండి..తాను ఉంటే ఈ ప‌రిస్థితి వ‌చ్చేదికాద‌ని వ్యాఖ్యానించారు. ప్ర‌స్తుతం తాను అమెరికా ప్రెసిడెంట్ గా ఉండి ఉంటే ఇలా వెన‌క వ‌ర‌స‌లో కూర్చోపెట్టేవారు కాద‌న్నారు. రియ‌ల్ ఎస్టేట్ అయినా..రాజ‌కీయాలైనా..జీవితం అయినా లొకేష‌న్ చాలా ముఖ్యం అంటూ వ్యాఖ్యానించారు ట్రంప్. తాను ప్రెసిడెంట్ గా ఉండి ఉంటే అమెరికా ఇప్పుడున్న దాని కంటే మెరుగ్గా ఉండేద‌ని..ఇప్పుడు మాత్రం ప్ర‌పంచ వేదిక‌పై అమెరికాకు స‌రైన గౌర‌వం ద‌క్క‌టంలేద‌న్నారు.

Next Story
Share it